నరసరావుపేట రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలు వెంటనే చెల్లించాలని, ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించారు. తొలుత జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి తదితర నాయకులు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు. అనంతర మీడితో మాట్లాడారు.
– డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బకాయిలు వెంటనే కూలీలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించలేదని తెలిపారు. ఇప్పటికే దాదాపు రూ.234 కోట్లు బకాయిలు ఉన్నట్టు వివరించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని, కూలీల వలసల నివారించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో వేతనాలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షలు ఐ.రామమూర్తి, రాష్ట్ర కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శి పడాల చక్రారెడ్డి, జిల్లా నాయకులు ఆళ్ల లక్ష్మీనారాయణ, నియోజకవర్గ అధ్యక్షుడు ముండ్రు హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.


