బొల్లాపల్లి : ఇరువురు కుమారులకు గడ్డి మందు తాపించి తానూ తాగిన సంఘటనలో చికిత్స పొందుతూ తండ్రి, చిన్న కుమారుడు మృతి చెందారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని గంగుపల్లి తండాకు చెందిన చిన్ని నాయక్ తన భార్య కాపురానికి రాలేదని మనస్తాపానికి గురై వారం రోజుల కిందట తన ఇరువురు కుమారులకు కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలిపి తాపించాడు. అనంతరం తానూ తాగాడు. దీంతో అస్వస్థతకు గురైన వారిని తండావాసులు చికిత్స నిమిత్తం వినుకొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి తండ్రి బాణావత్ చిన్ని నాయక్ (28), చిన్న కుమారుడు ఈశ్వర నాయక్ (6)లు మృతి చెందారు. మరో కుమారుడు ఏడేళ్ల శివానాయక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. భార్య బుజ్జి భాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సయ్యద్ సమీర్ బాషా తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు అందజేశామని తెలిపారు.


