ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు మట్టి తరలింపును అడ్డుకున్న స్థానికులు అక్రమార్కులకు పోలీసుల అండదండలు
వినుకొండ: రేయింబవళ్లు భారీ యంత్రాలతో, పెద్ద టిప్పర్లతో రూ.కోట్లాది విలువైన మట్టి తరలిస్తున్న అక్రమార్కులను శనివారం ఉదయం గ్రామస్థులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 1లో సుమారు 89 ఎకరాల విస్తీర్ణంలో రూ.కోట్లాది విలువైన మట్టిని అక్రమంగా తవ్వి, వినుకొండ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు అక్రమ లాభాలు పొందుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో, గ్రామానికి అవసరమైన ఒక తట్ట మట్టిని కూడా తీసుకెళ్లనివ్వకుండా స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు తెలిపారు. ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు కానీ, సంబంధిత శాఖలు కానీ స్పందించకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ మైనింగ్‌కు అధికారుల అండ
వెంకుపాలెం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన వినుకొండ ఎస్‌ఐ పుల్లారావు, డిప్యూటీ తహసీల్దార్ మురళితోపాటు సిబ్బంది వెళ్లి దర్యాప్తు చేపట్టారు. కానీ మట్టి లారీలను విడిచి పెట్టాలని ఎస్సై పుల్లారావు గ్రామస్తులను హెచ్చరించారు. అదేమని ప్రశ్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. అక్రమార్కులకు పోలీసులు అండగా ఉండటం గ్రామస్తులను విస్మయానికి గురిచేశారు.
నాడు అక్రమం నేడు సక్రమం..
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వల్లభ ఫ్యాక్టరీ వద్ద తన సొంత భూముల్లో మట్టిని ఫ్యాక్టరీ అవసరాలకు తరలించారు. ప్రస్తుత ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాత్రం ఫిర్యాదు చేసిన వారిపై కార్యకర్తలతో వెళ్లి నానా గందరగోళం సృష్టించారు. అయితే అదే ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు జరుగుతుంటే నోరు మెదకపు మెదపకపోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు వెంటనే స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని, లేకపోతే గ్రామస్తులంతా కలిసి ఉద్యమం చేపడతారని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ మురళికి వినతిపత్రం అందజేశారు.


