దాచేపల్లిలో ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

దాచేపల్లిలో ఘర్షణ

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

వ్యక్తిని చితకబాదటంతో ఉద్రిక్తత ● ఇరువర్గాలు పరస్పర దాడులు ● చెదరగొట్టిన పోలీసులు ● సీఐ రాజేష్‌కు స్వల్పగాయాలు

వ్యక్తిని చితకబాదటంతో ఉద్రిక్తత

దాచేపల్లి : భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని శివాలయం వద్ద ఓ వ్యక్తిపై గురువారం రాత్రి పలువురు మూకుమ్మడిగా దాడికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడి తరఫున బంధువులు దాడి చేసిన వ్యక్తులపై ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలను చెదరగొడుతున్న సమయంలో దాచేపల్లి సీఐ రాజేష్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దాచేపల్లిలోని శివాలయం సమీపంలో నివసిస్తున్న పఠాన్‌ రాజ్‌బుడే అనే వ్యక్తి మద్యంమత్తులో తన భార్య, కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ ఘర్షణ పడుతున్నాడు. రాజ్‌బుడే తననే దుర్భాషలాడుతున్నాడని ఇంటి పక్కనే ఉన్న జానీబేగం అనే మహిళ వాగ్వివాదానికి దిగింది. ఈ క్రమంలో రాజ్‌బుడే తనను దుర్భాషలాడుతున్నాడని పిడుగురాళ్లలో ఉన్న తన బంధువులకు ఆమె ఫోన్‌లో చెప్పింది. పిడుగురాళ్ల నుంచి కొంతమంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై దాచేపల్లి శివాలయం వద్దకు చేరుకుని రాజ్‌బుడేపై విచక్షరహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాజ్‌బుడే తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రాజ్‌బుడే బంధువులు, స్థానికులు దాడికి పాల్పడిన వ్యక్తులపై ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు దాడులు చేసుకుంటున్న క్రమంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొడుతున్న క్రమంలో సీఐ రాజేష్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీలతో ఇరువర్గాలను చెదరగొట్టారు. రాజ్‌బుడేపై దాడి చేసి పారిపొతున్న వారిలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన రాజ్‌బుడేని వైద్యం కోసం తొలుత గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రాజ్‌బుడే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ రాజేష్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement