ఉద్యోగుల విషయంలో జీజీహెచ్ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం నోటిఫికేషన్‌లు ఇచ్చినా భర్తీ చేయడంలో పలు అడ్డంకులు ఏళ్ల తరబడి తీవ్రంగా నష్టపోతున్న కింది స్థాయి ఉద్యోగులు
గుంటూరు మెడికల్: అంతా మా ఇష్టం... ఏది చేసినా అడిగెదెవ్వరు... అన్నట్లుగా గుంటూరు జీజీహెచ్ పరిపాలన అధికారులు వ్యవహరిస్తున్నారు. వారికి నచ్చక పదేళ్లుగా పోస్టు ఖాళీగా ఉన్నా ప్రమోషన్ ద్వారా భర్తీ చేయలేదు. ప్రమోషన్లు ఇస్తామని కిందిస్థాయి ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏడాదిలోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ గడువు ముగిసే వరకు సాగదీసి, మరోసారి నోటిఫికేషన్ ఇస్తామని పదోన్నతులు రాకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారు. వారి పక్షపాత ధోరణితో సకాలంలో ప్రమోషన్లు రావటం లేదని పలువురు వాపోతున్నారు.
ముచ్చటగా మూడోసారీ..
గుంటూరు జీజీహెచ్‌లో రికార్డు అసిస్టెంట్ పోస్టులు 2021 నుంచి రెండు ఖాళీగా ఉన్నాయి. కిందిస్థాయి ఉద్యోగుల్లో చాలా మంది అర్హులున్నారు. గతంలో రెండు సార్లు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. తాజాగా మళ్లీ నోటిఫికేస్ ఇచ్చారు. ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ పోస్టులు ఐదుకుపైగానే ఖాళీగా ఉన్నాయి. కొన్నింటిని ఇక్కడి ఉద్యోగులకు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి. పది సంవత్సరాలుగా అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీనివల్ల పలు కిందిస్థాయి పోస్టులు రద్దయ్యాయి. కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే ప్రమోషన్‌లు ఇచ్చారు. మిగతావారు కూడా కోర్టును ఆశ్రయించారు. జిల్లా కలెక్టర్‌కు, ఉద్యోగుల స్పందన కార్యక్రమాల్లో సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పరిస్థితి మారలేదు. నాలుగో తరగతి ఉద్యోగుల ప్రమోషన్స్‌లో కోర్టుకెళితేనే పని అవుతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు.
వారికి మాత్రం ఓకే...
గుంటూరు జీజీహెచ్, గుంటూరు మెడికల్ కాలేజ్‌ల అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఆ దిశగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో జిల్లాలోనే పరిపాలన అధికారులుగా (ఏఓ)పనిచేసిన ఇరువురు నేడు జీజీహెచ్, వైద్య కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)లుగా ఉన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఈనెల 13న అడిషనల్ డీఎంఈగా, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు 2024 అక్టోబర్‌లో అడిషనల్ డీఎంఈగా ప్రమోషన్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ సీఎం సాయికాంత్‌వర్మ ఈ విషయంపై దృష్టి సారించి న్యాయం చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.


