నాదెండ్ల: తూబాడు గ్రామంలో ‘టీడీపీ నేతల బరితెగింపు’ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథానానికి అధికారులు స్పందించారు. ఇన్‌చార్జి తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపివేయించారు. ఈ నెల 13వ తేదీ నుంచి రక్షిత మంచినీటి చెరువు సర్వే నెం.402లో 38.58 సెంట్ల విస్తీర్ణంలో అక్రమ మట్టి తవ్వకం జరుగుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా గ్రామంలోని స్మశాన వాటిక స్థలంను కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ ఈ నెల 20న కొందరు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన గడిపూడి నాగేంద్రం స్థలంతో పాటు పక్కనే ఉన్న స్మశానవాటిక స్థలాన్ని కొంతమేర ఆక్రమించి చెరువు మట్టి తోలి చదును చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆదేశాల మేరకు స్మశానవాటిక ఆక్రమణబారిన పడకుండా చర్యలు తీసుకున్నారు.


