నరసరావుపేట టౌన్ : నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారిగా ఎన్. రమేష్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 మంది అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా రమేష్ నరసరావుపేటకు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు చిత్తూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయ అధికారిగా రమేష్ విధులు నిర్వహించారు. మే 7వ తేదీలోగా న్యాయాధికారులు నూతన స్థానంలో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వినుకొండ: రాష్ట్ర పురపాలక సంఘాల మొత్తంలో ఆస్తి పన్ను వసూళ్లలో వినుకొండ పురపాలక సంఘం 95 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్‌కుమార్, సీడీఎంఏ సంపత్‌కుమార్ చేతుల మీదుగా వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ కె.శివరామ్‌ప్రసాద్‌ను బుధవారం విజయవాడలో జరిగిన వర్క్‌షాప్‌లో శాలువాతో, మెమోంటోతో ఘనంగా సత్కరించారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 526.00 అడుగులకు చేరింది. ఇది 160.4330 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,800 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


