జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావు పేట: జిల్లాలో పెద్ద ఎత్తున న్యూట్రీ గార్డెన్ల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో న్యూట్రీ గార్డెన్ల అభివృద్ధిపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ విధానంతో న్యూట్రీ గార్డెన్లను అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక, సామూహిక ఆరోగ్య కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్లను అభివృద్ధి చేయాలన్నారు. ఈ నెలాఖరు నాటికి న్యూట్రీ గార్డెన్ల సాగుకు అనువుగా నేలలను తయారు చేసుకోవాలన్నారు. మే నెల మొదటి బుధవారం రోజున జిల్లావ్యాప్తంగా న్యూట్రీ గార్డెన్లను ప్రారంభించేందుకు సమాయత్తం అవ్వాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో కిచెన్ గార్డెన్లు, పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటల కోసం విత్తన పంపిణీ చేపట్టాలన్నారు. మండలానికి ఒకటి చొప్పున కమ్యూనిటీ న్యూట్రీ గార్డెన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. గార్డెన్‌లు లాభసాటి వ్యాపారంలా మలుచుకునేలా స్వయం సహాయక సంఘాల మహిళలకు, కమ్యూనిటీ గార్డెన్ నిర్వాహకులకు ప్రత్యేక శిక్షణ అందచేయాలన్నారు. కలెక్టరేట్ లో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రయోగాత్మకంగా న్యూట్రీ గార్డెన్లను అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచాలన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధవి, అమల కుమారి, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, డీఎంహెచ్‌ఓ రవి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.


