సీఆర్డీఏ ఏసీగా బాధ్యతలు స్వీకరించిన కె.కార్తీక్‌ | - | Sakshi
Sakshi News home page

సీఆర్డీఏ ఏసీగా బాధ్యతలు స్వీకరించిన కె.కార్తీక్‌

Apr 23 2026 7:48 AM | Updated on Apr 23 2026 7:48 AM

తాడికొండ: సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా కొల్లాబత్తుల కార్తీక్‌ బాధ్యతలు చేపట్టారు. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం 3వ ఫ్లోర్‌లోని ఆయన చాంబర్‌లో బుధవారం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు తొలుత సీఆర్డీఏ కమ్యూనికేషన్స్‌ విభాగ జాయింట్‌ డైరెక్టర్‌ జి.రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్తీక్‌కు కమిషనర్‌ వి.విజయ రామరాజు, అడిషనల్‌ కమిషనర్‌ ఎ.భార్గవ తేజ, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ వల్లభనేని శ్రీనివాసరావు, ఐటీ విభాగ డైరెక్టర్‌ బి. మల్లికార్జున రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

వ్యవసాయ అధికారుల సంఘం జిల్లా ప్రెసిడెంట్‌గా శైలజారాణి

కొరిటెపాడు(గుంటూరు) : గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం ప్రెసిడెంట్‌గా మంగళగిరి మండలం ఏఓ జంపని శైలజారాణి ఎన్నికయ్యారు. స్థానిక కృషీ భవన్‌లో బుధవారం జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా ప్రెసిడెంట్‌గా శైలజారాణితో పాటు వైస్‌ ప్రెసిడెంట్‌గా దుగ్గిరాల మండలం ఏఓ రాగాల విజయబాబు, జనరల్‌ సెక్రటరీగా పెదకాకాని ఏఓ కె.రమణకుమార్‌, జాయింట్‌ సెక్రటరీగా పి.సంధ్యారాణి, కోశాధికారిగా బి.కిశోర్‌లు ఎన్నికయ్యారు. నూతన కమిటీ మూడు సంవత్సరాల పాటు కొనసాగనుంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి, ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం ప్రెసిడెంట్‌ బాల భాస్కర్‌, కార్యదర్శి బి.ప్రవీణ్‌, కోశాధికారి మురళీ కిషోర్‌ల ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అనంతరం నూతన సభ్యులను సత్కరించి, అభినందనలు తెలిపారు.

గుంటూరులో మోడల్‌ లా సెట్‌

గుంటూరు లీగల్‌: ఈ నెల 26వ తేదీన ఏపీ బీసీ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉచిత మోడల్‌ లా సెట్‌ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో అఫీషియల్‌ రిసీవర్‌ పి.టి.కోటేశ్వరరావు, మాజీ గవర్నమెంట్‌ ప్లీడర్‌ పోకల వెంకటేశ్వర్లు, అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ పీపీ పల్లపు కృష్ణ, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ కొండవీటి శ్రీనివాసరావులు ఆవిష్కరించారు. న్యాయవాది పల్లపు కృష్ణ మాట్లాడుతూ గుంటూరు శ్యామలానగర్‌లో ఉన్న మాంటిస్సోరి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ లో ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్‌ అసోసియేషన్‌ లైబ్రరీ సెక్రటరీ రాజేష్‌ లింగం, న్యాయవాదులు కె.వీరభాస్కర్‌, ఓర్సు జనార్దన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి సాక్షి భావ నారాయణ బ్రహ్మోత్సవాలు

పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీసమేత సాక్షి శ్రీ భావనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి మే 5వ తేదీ వరకు జరుగుతాయని ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. 23వ తేదీ రాత్రి 10 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. 24వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు పంచామృత స్నపన తిరుమంజన ఉత్సవం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. ధర్మకర్తల మండలి డైరెక్టర్‌ గున్నాథరావు, సభ్యులు కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్‌, ధరణికోట సాయికిరణ్‌, ఆకు రాతి అనూరాధ, ఊటుకూరి బాజీ శిరీష, సింహాద్రి రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement