ఇంటికి తాళం వేసి షిర్డీ యాత్రకు వెళ్లిన గృహ యజమాని గృహం, బీరువా తాళాలు పగులగొట్టిన దుండగులు స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు విలువైన వస్తువులు లేవని చెప్పటంతో ఊపిరిపీల్చుకున్న పోలీసులు
నరసరావుపేట ఈస్ట్: సతైనపల్లి రోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో బుధవారం శాప్ లీగ్ పోటీల్లో భాగంగా ఫుట్‌బాల్, బాక్సింగ్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు అండర్–15, యూత్ అండర్–21 బాలబాలికలకు ఫుట్‌బాల్, అలాగే అండర్– 15, అండర్– 19 బాలబాలికలకు బాక్సింగ్ పోటీలను నిర్వహించి జిల్లా జట్లు ఎంపిక చేశారు.
నాదెండ్ల: ఓ పక్క అప్పుల బాధ, మరోపక్క కుటుంబ కలహాల నేపధ్యంలో ఒడిషా కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గణపవరం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఒడిశా రాష్ట్రం భద్రక్‌జిల్లా కాన్ప్‌డ్ గ్రామానికి చెందిన నిదానిధర్‌దాస్ (46) భార్య అలియాదాస్, తమ్ముడు జలంధర్‌తో కలిసి గ్రామంలోని చవిటిపాలెంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ స్ధానిక స్పిన్నింగ్ మిల్లుల్లో కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. కొంతకాలంగా పరిశ్రమల్లో పనులు లేకపోవటంతో అప్పుల సమస్యల్లో చిక్కుకున్నారు. ఆర్థిక విషయాల్లో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. భార్య అలియాదాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నరసరావుపేట టౌన్ : ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోకి చొరబడిన దుండగులు బీరువాను ధ్వంసం చేశారు. నగదు, విలువైన వస్తువులు లభ్యం కాకపోవటంతో వెనుతిరిగారు. ప్రకాష్‌నగర్‌లో బుధవారం వెలుగు చూసిన చోరీ యత్నం సంఘటనకు సంబంధించి వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాష్‌నగర్ జిల్లా రిజిస్టార్ కార్యాలయం వెనుక ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యలవర్తి రాంప్రసాద్ కుటుంబ సభ్యులతో మూడు రోజుల క్రితం షిరిడీ యాత్రకు వెళ్తూ ఇంటికి తాళాలు వేసి వెళ్లాడు. బుధవారం ఉదయం ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు విషయాన్ని వన్‌టౌన్ పోలీసులకు తెలియజేశారు. సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి కింద, పై అంతస్తులోని రెండు తలుపుల తాళాలను పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బీరువాను ధ్వంసం చేసి, అందులోని సామాన్లను చిందరవందరుగా పడేసి ఉండటాన్ని గమనించారు. షిరిడీ యాత్రలో ఉన్న ఇంటి యజమానితో సీఐ మాట్లాడారు. ఇంట్లో విలువైన వస్తులు, నగదు ఏమీ లేవని చెప్పటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలను సేకరించారు. గృహ సమీపంలోని సీసీ పుటేజ్‌లను పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు.


