అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు
నరసరావుపేట: డ్రగ్స్, గంజాయి అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలని, జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలు – అవగాహన కార్యక్రమాల సమీక్షకు సంబంధించి ఎన్‌సీఓఆర్‌డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి నిర్వహించారు.
ప్రమాద రహిత జిల్లాగా ..
నరసరావుపేట: పల్నాడును రహదారి ప్రమాద రహిత జిల్లాగా చేయటమే తమ ముందున్న లక్ష్యమని, అందుకు అవసరమైన ప్రణాళికలు, ముందస్తు చర్యలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమీక్ష సమావేశం కమిటీ సెక్రటరీ అయిన రవాణాశాఖ అధికారి జి.సంజీవకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ ప్రమాదం జరిగిన అక్కడ బ్లాక్ స్పాట్స్ గుర్తించి మరోసారి అక్కడ జరగకుండా లాక్ బోర్డులను ఏర్పాటు చేయించాలని అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవకుమార్, జిల్లా రోడ్డు ప్రమాదాల గణాంకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయగా, పోలీస్ శాఖ నుంచి జిల్లా ఎస్పీ కృష్ణారావు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాన మంత్రి రహత్ పథకం వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఎకై ్సజ్ ఈఎస్ మణికంఠ, ఆర్‌డీఓ కె.బాలకృష్ణ, రోడ్డుసేఫ్టీ ఎన్‌జీఓ కన్వీనర్ దుర్గా కుమారి, ఎంవీఐ మల్లేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.
మలేరియా వ్యాప్తి నివారణకు కృషి చేయాలి
నరసరావుపేట: మంచినీటిలో పెరిగే ఎనాఫిలిస్ దోమ ఇళ్ల పరిసరాలలో నిల్వ ఉన్న నీటిలో పెరిగి కుట్టడం వల్ల మలేరియా వ్యాపిస్తుందని, ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడుతూ నీటి నిల్వలు లేకుండా చూడాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ నజీర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 25 నుంచి నిర్వహించే ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యానర్, వాల్‌పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ఆవిష్కరించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పద్మావతి, అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, హెల్త్ సూపర్‌వైజర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


