● ముఖ్యఅతిధిగా పాల్గొన్న అమలకుమారి మాట్లాడుతూ రసాయన వ్యవసాయం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి గ్రీన్ హౌస్ వాయువులు అధికమవుతున్నాయని తెలిపారు.
● ప్రకృతి వ్యవసాయం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ విధానంలో చీడపీడల ప్రభావం తగ్గడంతో పాటు నేల సారవంతం అవుతుందని, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.
● విత్తనాలను గుళికలుగా తయారు చేసి ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతాలతో విత్తాలని సూచించారు. దీని వల్ల ఎండ పరిస్థితుల్లో కూడా పంటలు తట్టుకుంటాయని తెలిపారు.
● కృషి విజ్ణాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి మాట్లాడుతూ పీఎండీఎస్ పంటలు సాగు చేయడం ద్వారా నేలలో పోషకాలు పెరిగి రసాయన ఎరువుల అవసరం తగ్గుతుందని తెలిపారు.
డీపీఎం అమలకుమారి
నరసరావుపేటరూరల్: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది కరవు పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు ప్రకృతి వ్యవసాయ సాగు చేపట్టాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌లో భాగంగా ఐసీఆర్‌పీ, ఎఫ్‌ఎంటీలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బృందావనం సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. నరసరావుపేట, చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు, రొంపిచర్ల, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమంలో జిల్లా ట్రైనర్ సైదయ్య, ఎన్‌ఎఫ్‌ఏలు అప్పలరాజు, నందకుమార్, మేరి, సౌజన్య, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.