ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి
పిడుగురాళ్లలోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఔట్ పేషెంట్ (ఒ.పి.) రోగులకు వైద్య సేవలను ప్రారంభించేందుకు వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల, అనుబంధ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టర్లు సివిల్ పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. పెండింగ్‌లో పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.చంద్రశేఖర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ప్రసూనలతో పాటు పిడుగురాళ్ల బోధనాస్పత్రి నిర్వాహకులు ప్రిన్సిపల్ సునీత, ఆసుపత్రి సూపరింటెండెంట్ జి.గౌరి, ఏపీ ఎంఐడీసీఎస్ అధికారులు, మేఘా ఇండస్ట్రీస్ కాంట్రాక్టర్ హాజరయ్యారు.
నరసరావుపేట: జిల్లాలో రైతులకు ఆర్థికంగా మరింత బలాన్నిచ్చే లక్ష్యంతో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ (కేసీసీ) పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకర్లతో కేసీసీ జారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందగలరని పేర్కొన్నారు. కేసీసీ ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం తక్షణ ఆర్థిక సహాయం పొందవచ్చునని, ఇది రైతులపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. లబ్ధిదారులకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయాలని, ఇప్పటికే కార్డు పొందిన రైతులు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించి ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలను పొందాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకు ప్రతినిధులు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆర్థిక స్థితిని మెరుగు పరచుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఐ.జగ్గారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
గిరిజన ఆవాసాల్లో మౌలిక వసతులు
కల్పించండి
గిరిజన ఆవాస ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం పీఎం జన్‌మన్, పీఎం జుగా పథకాల కింద మంజూరైన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీఎం జన్‌మన్, పీఎం జుగాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఎం జన్‌మన్ పథకం కింద చెంచుల నివాస ప్రాంతాల్లో పక్కా ఇళ్లు, కుళాయి ద్వారా ఇంటింటికి నీటి సరఫరా, వసతి గృహాలు, అంగన్‌వాడీ నిర్మాణం, గృహాల విద్యుద్దీకరణ, మొబైల్ టవర్ల నిర్మాణం కోసం రూ.41.38 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకూ రూ.17.56 కోట్ల పనులు పూర్తి చేశారన్నారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇబ్బందులు ఉన్న చోట పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఇంటింటికీ సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేయాలన్నారు. పీఎం జుగా కింద జిల్లాలోని ఏడు గిరిజన గ్రామాల్లో దాదాపు రూ.18 కోట్ల మేరకు పనులు చేపట్టాల్సి ఉందన్నారు. శ్రీశైలం ఐటీడీఏ పీవో వెంకట శివప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుదారుడి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యమివ్వండి
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు సమాధానం చెప్పడం కంటే అర్జీదారుడి సమస్యలకు పరిష్కారం చూపడానికి ప్రాధాన్యమివ్వాలని జిల్లా కలెక్టర్ అన్నారు. అప్పుడే రీ ఓపెన్ కేసులు తగ్గించగలమని పేర్కొన్నారు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదులను ఒక శాఖ నుంచి మరొక శాఖకు బదలాయించే అవకాశం సైతం ఆన్‌లైన్‌లో ఇచ్చామని, సంబంధిత అర్జీలతో తమ శాఖకు సంబంధం లేదు అన్నట్టు అధికారులు వ్యవహరించవద్దన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా


