పట్నంబజారు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం సాయంత్రం గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లాలాపేట పోలీసుస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పూర్తి స్థాయిలో స్టేషన్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని నేరాల పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో శాంతిభద్రతలు కాపాడాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. గత ఆరు నెలల కాలంలో 300 మందిని గంజాయి, ఇతర డ్రగ్స్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు గుర్తించామన్నారు. రౌడీషీటర్లు, ఇతర నేరస్తులపై నిఘా ఉంచాలని, ఎప్పటికప్పుడు వారి కదలికలను పర్యవేక్షించాలని సూచించారు. నేరాలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం స్టేషన్ రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ బెల్లం శ్రీనివాస్, లాలాపేట సీఐ శివప్రసాద్, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లి రూరల్: గ్యాస్ ఏజన్సీలు వినియోగదారుల ఇంటికి వెళ్లి సిలిండర్ డెలివరీ చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయీస్ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ ఆదేశించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బాలాజీ గ్యాస్ కంపెనీని ఆమె బుధవారం తనిఖీ చేశారు. కంపెనీ వద్దకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. శ్రీవాస్ నుపూర్ మాట్లాడుతూ ముందుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించామని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను గోడౌన్ల వద్ద డెలివరీ ఇవ్వవద్దని, డోర్ డెలివరీలో నిర్లక్ష్యం వహిస్తే గ్యాస్ ఏజన్సీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయీస్ అధికారిణి కోమలి పద్మ, సీఎస్ డీటీ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు బుధవారం విరాళాలను అందజేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రణీత్‌కుమార్, పవిత్ర కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి తమ కుమారుడు చిన్నారి జి.దేవాశిష్ పేరిట రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అలాగే పవిత్ర తల్లి ఈశ్వరి, సోదరుడు నిఖిల్ చిన్నారి జి.ధీరన్ సాయి పేరిట రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు డీవీవీ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 529.60 అడుగులకు చేరింది. ఇది 167.3676 టీఎంసీలకు సమానంఅని అధికారులు తెలిపారు. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 3,031, ఎడమ కాలువకు 5,297, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 23,990, ఎస్‌ఎల్‌బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదల అవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 34,618 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది.


