గరికపాటి వ్యాఖ్యలు దురదృష్టకరం | - | Sakshi
Sakshi News home page

గరికపాటి వ్యాఖ్యలు దురదృష్టకరం

Mar 23 2026 8:45 AM | Updated on Mar 23 2026 8:45 AM

గరికపాటి వ్యాఖ్యలు దురదృష్టకరం మతిస్థిమితంలేని బాలికపై లైంగికదాడియత్నం ఏపీటీఎఫ్‌ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి దాస్‌ 31న మా ఏపీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ గీతాహసంతి

సత్తెనపల్లి: నిరుపేదల పిల్లలు పాఠశాలలో తినే మధ్యాహ్నభోజనంపై సాహితీవేత్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ గీతాహసంతి అన్నారు. ఈ సందర్బంగా ఒక వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు గత ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద, ప్రస్తుత ప్రభుత్వంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో పౌష్టికాహరం అందించటం జరుగుతుందన్నారు. పసి పిల్లలు, పేద వారు తినే అన్నంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరమన్నారు. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, ఆలోచించాలని, పెద్దలు, సాహితీవేత్తలు మీరు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయన్నారు.

రెంటచింతల: మతిస్థిమితంలేని మైనర్‌బాలికపై ఓ యువకుడు లైంగికదాడి యత్నానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. మానసిక వికలాంగురాలైన బాలిక బహిర్భూమికి వెళ్లడాన్ని గమనించి సతీష్‌ అనే యువకుడు లైంగికదాడియత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు గమనించి రావడంతో యువకుడు పరారయ్యాడని బాలిక తల్లి పోలీసులకు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. గురజాల డీఎస్పీ వెంకటరమణ స్థానిక పోలీసు స్టేషన్‌ను సందర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌ :ఏపీటీఎఫ్‌ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి దాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కోర్డు వద్ద ఉన్న ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో పెదనందిపాడు మండలం గోగులమూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిపాటి దాస్‌ను ఎన్నుకున్నారు. 11 ఏళ్లుగా సంఘ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కె.బసవ లింగారావు ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి స్థానాన్ని భర్తీ చేశారు.

తెనాలిటౌన్‌: మా–ఏపీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన వివిధ రంగాల్లోని ప్రముఖులు ఎనిమిది మందికి అష్టదిగ్గజాల పేరిట ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా వెల్లడించారు. తెనాలిలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌, 24 విభాగాల యూనియనన్‌్‌ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ఆలపాటి నగర్‌లోని రత్న ఫార్చూన్‌ కల్యాణ మండపంలో ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఈ వేడుకలకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతారు. తమ సంస్థ అష్టదిగ్గజాలుగా ఎంపిక చేసిన ప్రముఖుల్లో రాష్ట్రంలో ప్రమాదాల నివారణలో 2025 సంవత్సరానికి ప్రథమ స్థానం పొందిన జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌, కుష్టు, ఎయిడ్స్‌ పీడితులకు సాయం చేస్తున్న హార్వెస్ట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత కత్తెర సురేష్‌ కుమార్‌ర్‌, అనాధ శవాల దహనసంస్కారి కుర్రా శ్రీను, ఉచిత వైద్య శిబిరాల శిఖరం డాక్టర్‌ డి.శారద, వృద్ధాశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి, కూచిపూడి కళాకారిణీ తేజస్వి ప్రఖ్య, షార్ట్‌ ఫిలిమ్స్‌ ఉత్తమ నటి సుజిత, యూట్యూబ్‌ ఉత్తమ కేరెక్టర్‌ నటి సాయిప్రకర్షలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాసయాదవ్‌, పెదరావూరు ఫిలిం స్టూడియోస్‌ మేనేజర్‌ పినపాటి సురేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement