రూ.7 లక్షలు పక్కదారి
నాదెండ్ల: కనపర్రు ఎస్సీ కాలనీలోని లక్ష్మీతిరుపతమ్మ మహిళా పొదుపు గ్రూపులో రూ.7 లక్షలు మాయమైన ఘటనపై గ్రూపు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామ ఎస్సీ కాలనీలో ఎన్నో ఏళ్ల క్రితం ఈ గ్రూపు ఏర్పడింది. ప్రస్తుతం గ్రూపు లీడర్‌గా ఉప్పలపాటి సుజాత వ్యవహరిస్తుండగా, పి.వెంకటలక్ష్మి, సీహెచ్ పార్వతి, సీహెచ్ కుమారి, ఎన్.సామ్రాజ్యం, సీహెచ్ పద్మ, సీహెచ్ భూలక్ష్మీ, డి.నాగేంద్రమ్మ, జి.రీనా, ఎం.అంజమ్మ గ్రూపు సభ్యులుగా ఉన్నారు. రీనా, అంజమ్మలు గ్రూపు నుంచి వైదొలగటంతో నూతనంగా మరో ఇరువురు సభ్యులను ఎన్నుకున్నారు. నరసరావుపేట ఏడీబీ ఎస్‌బీఐ నుంచి మూడేళ్ళ క్రితం రూ.15లక్షలు రుణం మంజూరు కావటంతో ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు పంచుకున్నారు. అప్పటి నుంచి గ్రూపు సభ్యులు నెలకు రూ.3 వేలు, రూ.100 పొదుపుతో కలిపి నెలకు ఒక్కొక్కరు రూ.3100లు చొప్పున లీడర్ సుజాతకు చెల్లిస్తూ వస్తున్నారు. మరో నాలుగు నెలల్లో రుణ చెల్లింపు పూర్తికావాల్సి ఉంది. తిరిగి మరలా రుణం పొందేందుకు గ్రూపు సభ్యులు తీర్మానం చేసుకునే సమయంలో లీడర్ చేతివాతం వెలుగులోకొచ్చింది. బ్యాంకులో ప్రతినెలా జమ చేయకుండా చేతివాటంతో రూ.8 లక్షలు మాత్రమే జమచేసి సుమారు రూ.7 లక్షలు దారి మళ్లించినట్లు గుర్తించారు. దీంతో సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తూ గ్రామ పెద్దలకు విషయం చెప్పారు. జిల్లాఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్ళనున్నట్లు సమాచారం. దీనిపై ఏపీఎం రమేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. సీసీ బండారు సుధను ఫోన్‌లో సంప్రదించగా గ్రూపు సభ్యులు చెల్లించాల్సిన బకాయిలు గ్రూపు లీడర్ సొంతానికి వాడుకున్న నగదుతో కలిపి సుమారు రూ.7 లక్షలుగా తేలిందని, అయితే గ్రూపు లీడర్ ఫిబ్రవరిలోనే బకాయిలు చెల్లిస్తానని చెప్పి నేటి వరకూ చెల్లించలేదని తెలిపారు.


