భారీగా పెరిగిన నూనెల ధరలు మళ్లీ రూ.6 నుంచి రూ.10 వరకు పెంపు వినియోగదారులపై మరింత భారం ధరలు పెంచుతున్న వ్యాపారులు
పెరిగిన ధరల వివరాలు రూ.లలో (సుమారు)
జిల్లాలో పరిస్థితి ఇదీ...
వంటింట్లో నూనె మంట
సలసల కాగుతున్న నూనెల ధరలు
మరో వైపు గ్యాస్ కొరతతో అల్లాడుతున్న ప్రజలు
సత్తెనపల్లి: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మన వంటింట్లో సెగలు పుట్టిస్తోంది. ఇప్పటికే గ్యాస్ కొరతతో జిల్లా ప్రజలు బాధపడుతుంటే .. దానికి తోడు వంటనూనెల ధరలు పెరగడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే లీటర్ వంట నూనె పై సగటున రూ. 6 నుంచి రూ.10 వరకు ధర పెరగడంతో బెంబేలెత్తిపోతున్నారు.
వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా వంటనూనెల సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. దీంతో దిగుమతులు తగ్గి మార్కెట్లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం ట్యాక్స్ ధరలు భగ్గుమనడానికి మరో కారణమైంది. పండుగల సీజన్ కావడంతో మార్కెట్లో వంటనూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ కారణాలను సాకు చూపి స్థానిక వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు పాత స్టాక్‌ను గోదాముల్లో బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పాత స్టాక్‌ను సైతం పెరిగిన కొత్త ధరలకే విక్రయిస్తూ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాలు, విజిలెన్‌న్స్ అధికారుల పర్యవేక్షణ కొరవడటం విమర్శలకు తావిస్తోంది.
ఒకవైపు ధరలు పెంచుతున్న కంపెనీలు, మరోవైపు ప్యాకింగ్ విషయంలోనూ మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. సాధారణంగా వినియోగదారులు నూనె ప్యాకెట్ కొనేటప్పుడు ధరను గమనిస్తారే తప్ప, అందులో ఎంత పరిమాణం ఉందనేది నిశితంగా చూడరు. ఇదే అదునుగా పలు కంపెనీలు లీటర్ ప్యాకెట్‌లో ఉండాల్సిన 900 గ్రాములకు బదులుగా కేవలం 850 గ్రాములు లేదా 800 గ్రాముల నూనె మాత్రమే నింపి మార్కెట్లోకి వదులుతున్నాయి. అంటే పరోక్షంగా ప్రజలు తక్కువ నూనెకు ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారు. వ్యాపారులు సాగిస్తున్న ఈ దందాపై అధికారులు తక్షణమే స్పందించి బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుతు న్నారు.
నూనె రకం గతంలో ప్రస్తుత ధర
ధర (లీటర్) (లీటర్) పామాయిలు 90–115 120–160
సన్‌ఫ్లవర్ ఆయిల్
(బ్రాండెడ్ తదితర) 140–155 160–180
వేరుశనగ నూనె 130–150 170–190
పల్నాడు జిల్లాలో రోజుకు గృహ, వాణిజ్య అవసరాలు నిమిత్తం పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె 10 వేల లీటర్లు వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 50 శాతం పామాయిలు, 40 శాతం సన్ ఫ్లవర్ ఆయిల్, 10 శాతం వేరుశనగ, ఇతర నూనెలు వాడుతున్నారు. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు గతంలో కంటే ఇటీవల రూ.6 నుంచి రూ.10 పెరిగింది. దీంతో వినియోగదారులపై భారం పడింది. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వంట నూనెలు సరఫరా చేస్తున్నారు.


