మాచర్ల: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టణంలో ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలను ఆయన కలుసుకున్నారు. పలువురు ఆయనకు పూలబొకేలు అందించి సత్కరించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలు, అభిమానులతో ముచ్చటించారు. పట్టణంలోని తూర్పు బావి వద్ద, ముస్లిం షాదీఖానాలో జరిగిన వైఎస్సార్ సీపీ నాయకుడు పఠాన్ చిన్నబద్రు కుమార్తె పఠాన్ తస్లీమా, మాజీ కౌన్సిలర్ షేక్ కరిముల్లా కుమారుడు షేక్ ఆకీల్‌ల నిశ్చయతాంబూలం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అదే విధంగా పట్టణంలోని నరిశెట్టి కళ్యాణమండపంలో జరిగిన తిరుమల కొండ నాగరాజు కుమార్తె హేమలత ఓణీల బహూకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్ రెడ్డి, అబ్దుల్ జలీల్, వైఎస్సార్ సీపీ నాయకులు చల్లా కాశయ్య, పిల్లి కొండలు, కొమెర గిరి, డేగ శివ, చల్లా మోహన్, చల్లా వెంకటేశ్వర్లు, యర్ర వెంకటేశ్వర్లు, బత్తుల శ్రీను, దుర్గారావు తదితరులున్నారు.
ప్రజాభిమానం ముందు కుట్ర కేసులు కొట్టుకుపోతాయి..
మాచర్ల: ప్రజాభిమాన ఉప్పెన ముందు చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కుట్ర కేసులు, రెడ్‌బుక్ కేసులు కొట్టుకుపోతాయని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతునాయక్ అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం మాచర్లలోని పార్టీ కార్యాలయంలో హనుమంతునాయక్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాభిమానం కలిగిన వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తుందన్నారు. గుండ్లపాడు జంట హత్య కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోయినా, కావాలని అక్రమంగా వారిని కేసుల్లో ఇరికించి జైలు పాలు చేశారన్నారు. దీనిద్వారా వారు సాధించింది ఏమీలేదని, ఇంకా పీఆర్కే, పీవీఆర్‌లకు ప్రజాభిమానాన్ని మరింత పెంచారన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పీఆర్కేకు వచ్చిన ఆదరణ చూసి కూటమి నాయకులకు కంటిమీద కునుకు ఉండడం లేదని పేర్కొన్నారు.


