పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం హుండీలు తెరచి కానుకలు లెక్కించారు. దేవదాయశాఖ ఆదేశాల మేరకు ఈ హుండీల కానుకలు లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా తెనాలి వైకుంఠపురంలోని పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఏసీ వి.అనుపమ హాజరయ్యారు. ఆలయంలో ఉదయం 9 గంటలకు కల్యాణ మండపంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 84 రోజులకుగాను కానుకల హుండీల ద్వారా రూ.48,76,103 ఆదాయం లభించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్‌లోని హుండీ ద్వారా రూ.2,81,368 సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం, వెండి కూడా వచ్చిందన్నారు. విదేశీ నగదు అమెరికన్ డాలర్లు 127 సమకూరినట్లు డీసీ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది, పెదకాకాని ఎస్‌బీఐ మేనేజర్ శ్రీనివాసరావు, సిబ్బంది, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సత్తెనపల్లి: పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో గల వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం మత్స్య జయంతి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామిని మత్స్యావతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కోదండ రామస్వామి, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
చేబ్రోలు: ిహందూ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం చంద్రమాసం ఆధారంగా రూపొందించిన శుభతిథి క్యాలెండర్‌ను శనివారం ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండల శివారు బ్రాహ్మణ కోడూరులో రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. దర్మ ప్రచారక్ మాట్లాడుతూ ఈ క్యాలెండర్ నూతన ఒరవడితో ఆకట్టుకుందన్నారు. తెలుగు నెలలు, తెలుగు వారాలు, తిథులతో కూడిన క్యాలెండర్‌ను హిందూ ఉపాధ్యాయ సమితి చేయటం అభినందనీయం అన్నారు. హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర కార్యదర్శి మట్టపూడి కిరణ్ కుమార్, ఎస్‌ఎస్‌ఎఫ్ పొన్నూరు ఖండ ఇంటూరి శివ రామకృష్ణ, రామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నూజండ్ల: గుర్తు తెలియని వ్యక్తులు సుబాబుల్ తోటను నరికివేసిన సంఘటన నూజండ్ల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సోమేపల్లి వెంకటరత్నంకు సుబాబుల్ తోట ఉంది. శనివారం ఉదయం తోటకు వెళ్లి చూడగా పెద్ద సంఖ్యలో చెట్లను విచ్చలవిడిగా నరికివేసినట్టు గుర్తించి ఐనవోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కోరారు.


