రికవరీ చేశారు..బొక్కేశారు
రూ.69 లక్షలు బకాయిలు
● రూ.3.52 కోట్లు స్వాహా
● ఏడేళ్లు రికవరీ కాని సొమ్ము
● బాధ్యులపై చర్యలు శూన్యం
● కొత్త రుణాల మంజూరు నిలిపివేత
● రుణాలు అందక డ్వాక్రా
మహిళల అవస్థలు
అచ్చంపేట: గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, చిన్నారులపై లింగ వివక్షను నిర్మూలించి, వారిని అభివృద్ధి చేసేందుకు డెవలప్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్(డ్వాక్రా) కార్యక్రమాన్ని 1982 సెప్టెంబరులో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ముఖ్యోద్దేశం మహిళల జీవన పరిస్థితులను మెరుగు పరచడం, తద్వారా పిల్లల ప్రాథమిక సామాజిక సేవలకు స్వయం ఉపాది కల్పంచడం. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు సంబంధిత రంగాలలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించి రుణ సౌకర్యం ఏర్పరచడం ద్వారా వారికి జీవనోపాధి కల్పించడమే కాకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం.
రూ.మూడు కోట్లు బకాయిలు
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, వారి కాళ్లపై వాళ్లు నిలబడేందుకు సీ్త్ర నిధి బ్యాంకు ద్వారా ప్రభుత్వం 2017 నుంచి 2022 వరకు అచ్చంపేట మండలంలో రూ.12 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ రుణాలు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వం నుంచి వచ్చాయి. రుణాలను వాయిదాల పద్ధతిలో రెండేళ్లలో చెల్లించాలి. నిజమైన లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.9 కోట్లు వసూలు కాగా, బినామీ పేర్లతో తీసుకున్న రూ.మూడు కోట్ల రుణాలు మాత్రం పేరుకుపోయాయి. వివిధ స్కీంల కింద మహిళలకు మరో రూ.మూడు కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు పూరెస్ట్ ఆఫ్ పూర్(పీఓపీ) కింద రూ.2 కోట్లు, మానవాభివృద్ధి కోసం హ్యుమన్ డవలప్‌మెంట్(హెచ్‌డీ) కింద రూ.40లక్షలు, కమ్యూనిటి ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(సీఐఎఫ్) రూపంలో రూ.43 లక్షలు ఇచ్చారు. కానీ రుణాలు ఇంకా బకాయిలున్నట్లు చూపుతున్నారు. బకాయిలు తాము ఎప్పుడో చెల్లించామని సంబంధిత గ్రూపుల సభ్యులు చెబుతున్నారు. మరి చెల్లించిన సొమ్ము బ్యాంకులో జమ కాకుండా ఎక్కడకు వెళ్లాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
వసూలైనట్లు స్పష్టమైన ఆధారాలు
సీ్త్రనిధి బ్యాంకు, పీఓపీ, సీఐఎఫ్, హెచ్‌డీ కింద రుణాలు పొందిన డ్వాక్రా మహిళలను అధికారులు విచారించారు. వారు ఎప్పుడో చెల్లించినట్లు చెబుతున్నారు. వీరిలో కొంతమంది వద్ద రసీదులున్నాయి. మరికొంతమందికి అసలు రసీదులే ఇవ్వనట్లు తేటల్లైమెంది. వసూలు చేసిన సొమ్మును కొంతమంది వెలుగు కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు (2017 నుంచి 2022వరకు ఉన్న) కొంత సొమ్మును బడా నాయకులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపితే ఎవరి వద్ద ఎంత మొత్తం ఉంది, ఎవరెవరు ఎంత స్వాహా చేశారనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిలిచిపోయిన కొత్త రుణాలు
గతంలో ఇచ్చిన రుణాల రికవరీలో అవకతవలు జరిగినట్లు విచారణలో స్పష్టం కావడంతో కొంతమందికి మాత్రమే నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. దాని పర్యవసానంగా డ్వాక్రా గ్రూపులకు కొత్త రుణాలు లేవు. సీ్త్రనిధి రుణాలను నిలిపివేశారు. పీఓపీ, హెచ్‌డీ, సీఐఎఫ్ రుణాల మంజూరే కావడం లేదు.
నేను ఇటీవలనే బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుతం సీ్త్రనిధి బ్యాంకు ద్వారా ఇంకా రూ.69 లక్షలు రావాల్సి ఉంది. తీసుకున్న రుణాలు బకాయి ఉండటం వల్ల కొత్త రుణాలు మంజూరు కావడంలేదు. పీఓపీ, సీఐఎఫ్, హెచ్‌డీ రుణాలన్నింటిని నిలిపి వేశారు. వాటిలో కూడా రికవరీ సక్రమంగా లేదు. ప్రస్తుతం మహిళలు బ్యాంకులలో పొదుపు చేసుకున్న రుణాలపై లింకేజి రుణాలు మాత్రమే ఇస్తున్నాం.
– వెంకటరెడ్డి, ఏపీయం,
వెలుగు కార్యాలయము, అచ్చంపేట
డ్వాక్రా గ్రూపు మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించినా బ్యాంకులో మాత్రం జమకాలేదు. ఆ డబ్బు వంద కాదు, వెయ్యి కాదు, లక్ష అంత కన్నా కాదు... ఏకంగా రూ.రూ.3.52 కోట్లు. ఏడేళ్లు గడిచినా ఆ సొమ్ము రికవరీ మాత్రం చేయలేదు. బాధ్యులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కానీ డ్వాక్రా మహిళలకు కొత్త రుణాల మంజూరు నిలిపివేశారు. దీంతో మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం.
రికవరీ చేశారు..బొక్కేశారు


