తిరునాళ్ల వెతలు తీరేనా...?
ఆలయ ఆదాయానికి గండి
విచ్చలవిడిగా వీఐపీ పాస్‌లతో గత ఏడాది ఇబ్బందులు ట్రాఫిక్ జామ్‌తో యాత్రికుల అవస్థలు నేడు కోటప్పకొండలో తిరునాళ్ల ఏర్పాట్లపై సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు రాక
ప్రారంభం కాని పనులు
నరసరావుపేట రూరల్: పవిత్ర మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల జాతరకు సమయం దగ్గర పడుతుంది. ఫిబ్రవరి 15వ తేదీ జరిగే తిరునాళ్ల కోసం 25 రోజులే సమయం ఉన్నా ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లపై దృష్టి పెట్టలేదు. గత ఏడాది తిరునాళ్ల నిర్వహణలో ఎదురైన అనుభవాలతో, లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. తిరునాళ్లలో షరా మాములుగా మారిన ట్రాఫిక్ సమస్య, వీఐపీ పాస్‌లజారీ, రహదారుల మరమ్మతుల పైనే ప్రభుత్వ శాఖలు దృష్టి సారించాల్సి ఉంది. తిరునాళ్ల ఏర్పాట్లపై రెండవ సమన్వయ సమావేశం మంగళవారం కోటప్పకొండలో నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులు పాల్గొనే సమావేశంలో ఆయా అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. కోటప్పకొండ తిరునాళ్ల జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కొండ మీదకు వచ్చి రెండు లక్షల మంది త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కొండ దిగువున జరిగే జాతరలో పాల్గొనే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. కొండ మీదకు వచ్చే సామాన్య భక్తులకు ప్రశాంతంగా స్వామి దర్శనం కల్పించాల్సి ఉంది. జాతరకు వచ్చే యాత్రికులు ట్రాఫిక్ సమస్య లేకుండా క్షేమంగా తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
వీఐపీ పాస్‌లతోనే సమస్య
గత ఏడాది తిరునాళ్లలో స్వామి వారి దర్శనానికి వచ్చే వీఐపీలతోనే సమస్య వచ్చింది. అధికారులు విచ్చలవిడిగా వీఐపీ పాస్‌లు జారీ చేయడం ఇందుకు కారణం. దాదాపు 10వేల పాస్‌లు జారీ చేయ గా, మరి కొన్ని నకిలీ పాస్‌లు కలిశాయి. దీంతో వీఐపీ క్యూలైన్ నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. సామాన్య భక్తుల క్యూలైన్ కన్నా వీఐపీ క్యూలైన్‌లోనే రద్దీ నెలకొంది. వేలాదిగా వచ్చిన వీఐపీలను నిలువరించడం సిబ్బందికి కష్టంగా మారింది. ఈ క్యూలైన్‌లో పలు మార్లు తోపులాటలు జరిగాయి.
ట్రాఫిక్ సమస్య ప్రతి ఏటా పరీక్షే
మహాశివరాత్రి రోజు రాత్రి జరిగే జాతర సంబరం ప్రత్యేకమైనది. విద్యుత్ ప్రభలతో కోటప్పకొండ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఈ జాతరను తిలకించేందుకు లక్షలాది మంది వస్తారు. కొండకు చేరుకునే అన్ని రహదారుల విస్తరణ గత కొంతకాలంలో పూర్తయింది. అయినా ట్రాఫిక్ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదు. ట్రాఫిక్ నిలిచిపోవడం, భక్తులు రోడ్లమీదే జాగారం చేయడం ప్రతి ఏటా కనిపిస్తుంది. గత ఏడాది కూడా పెట్లూరివారిపాలెం–కోటప్పకొండ రోడ్డు, గురవాయపాలెం– కోటప్పకొండల మధ్య గంటల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పోలీసులు ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెడుతున్నామని చెబుతున్నప్పటికి సత్ఫలితాలు ఇవ్వడం లేదు.
వీఐపీ పాస్‌ల జారీతో ఆలయ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. గత ఏడాది వీఐపీ దర్శనంలో దాదాపు 20వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారని అంచనా. ప్రత్యేక దర్శనంలో టికెట్ ద్వారా వీరు స్వామి వారిని దర్శించుకుంటే దాదాపు రూ.60 లక్షల వరకు ఆలయానికి ఆదాయం వచ్చేది. ఈ ఆదాయాన్ని ఆలయం కొల్పోవాల్సి వచ్చింది. దీంతో పాటు వీఐపీ పాస్‌లు ఉన్న వారిని కొండ దిగువ నుంచి ఆలయ ప్రాంగణానికి ప్రత్యేక బస్సుల్లో ఉచితంగా తరలిస్తారు. దీని వల్ల ఆర్టీసీపై కూడా భారీగా భారం పడుతుంది. వీఐపీ పాస్‌లకు బదులు వీఐపీ టికెట్ ఏర్పాటుచేసి అమలు చేయడం వల్ల వీఐపీల తాకిడిని తగ్గించే అవకాశం ఉంది.
తిరునాళ్లకు గడువు దగ్గరపడుతున్నా అధికారుల్లో ఇప్పటి వరకు చలనం లేదు. ప్రధానంగా ర హదారుల మరమ్మతు పనులు ప్రారంభించలేదు. యల్లమంద–గోనెపూడి రోడ్డు గోతుల మయంగా మారింది. ఈ రోడ్డులో పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. గురవాయపాలెం–గోనెపూడి రోడ్డు పలు చోట్లు దెబ్బతింది. కొండ దిగువున పనులు ప్రారంభించాల్సి ఉంది.
తిరునాళ్ల వెతలు తీరేనా...?
తిరునాళ్ల వెతలు తీరేనా...?


