యోగి వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశకాలు
జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల
నరసరావుపేట: వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశకాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల పేర్కొన్నారు. సోమవారం వేమన జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలను ఖండిస్తూ సమానత్వం, నైతికత, మానవ విలువలను తన పద్యాల ద్వారా ప్రజలకు అందించిన మహనీయుడు యోగి వేమన అన్నారు. సత్యం, ధర్మం, ఆచరణాత్మక జీవన విధానమే వేమన బోధనల సారమని, యువత ఆయన సందేశాలను జీవితంలో అమలు చేయాలని సూచించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవి అని కొనియాడారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, ఇతర అధికారులు పాల్గొని నివాళులు అర్పించారు.
డీఎల్‌టీసీ సమావేశం
నరసరావుపేట: ఏటా ప్రతి పైరు సాగు చేసేందుకు రైతుకు అయ్యే ఖర్చును బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ధారించేందుకు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల అధ్యక్షతన డిస్ట్రిక్ లెవల్ టెక్నికల్ కమిటి (డీఎల్‌టీసీ) సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన అభ్యుదయ రైతులతో చర్చించి పంటకు ప్రతి ఎకరాకు అవసరమయ్యే రుణాలను నిర్ణయించారు. దీనికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఇఓ కన్వీనర్‌గా పాల్గొనగా నాబార్డు డీడీఎం, ఎల్‌డీఎం, వ్యవసాయశాఖ జిల్లా అధికారి, ఫిషరీస్ డీడీ, హార్టికల్చరల్ డీపీఎం, వివిధ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
యోగి వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశకాలు


