భార్య వద్దకు వెళ్తూ మృత్యు ఒడిలోకి..
దాచేపల్లి: భార్య, బిడ్డల కోసం వెళుతున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. విధి ఆడిన వింత నాటకంలో భార్య బిడ్డలను చూడకుండానే భర్త కన్నుమూశాడు. ఈ హృదయవిదార ఘటన నడికుడి సమీపంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో మండలంలోని గామాలపాడుకి చెందిన సంకురాత్రి జగపతిబాబు(28) మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గామాలపాడుకి చెందిన ముక్కంటి, వెంకటరావమ్మ దంపతులకు జగపతిబాబు ఏకై క కుమారుడు కాగా కుమార్తె కూడా సంతానం. కారంపూడి మండలం ఒప్పిచర్లకి చెందిన రవళితో జగపతిబాబుకి వివాహాం కాగా వీరికి సాత్విక్(3), హేమశ్రీ(1) సంతానం. – నడికుడి మార్కెట్‌యార్డు వద్ద ఉన్న పెట్రోల్ బంకులో జగపతిబాబు పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగ కోసం భార్య రవళి ఆమె పుట్టింటికి వెళ్లింది. సంక్రాంతి పండుగ రోజు జగపతిబాబు కూడా అత్తగారింట్లోనే ఉండి ఆ తరువాత గామాలపాడుకి వచ్చాడు. పండుగ ముగియటంతో భార్య, పిల్లలను తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంపై జగపతిబాబు బయలుదేరాడు. ఈ క్రమంలో నడికుడి దాటిన తరువాత జామతోట వద్ద టాటా ఏసీ వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి వెళ్లాయి. ఈ ఘటనలో జగపతిబాబు తలకు బలమైన గాయాలు కాగా టాటా ఏసీ వాహనం డ్రైవర్ బెల్లంకొండ మండలం చిన్నరాజుపాలెంకి చెందిన కలపాల వీరయ్య కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ జగపతిబాబు మృతిచెందగా మెరుగైన వైద్యం కోసం వీరయ్యని గుంటూరుకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ జి.పాపారావు పరిశీలన చేశారు. మృతుడు జగపతిబాబు భార్య రవళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జగపతిబాబు కుటుంబంలో వరుస మరణాలు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జగపతిబాబు కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నది. జగపతిబాబు తల్లిదండ్రులు ముక్కంటి, వెంకటరావమ్మలు మృతిచెందగా తోడబుట్టిన చెల్లెలు కూడా మృతిచెందింది. ముక్కంటి తాలుకా కుటుంబ సభ్యులంతా మృతిచెందగా జగపతిబాబు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో జగపతిబాబు కూడా మృతిచెందటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జగపతిబాబు, రవళి దంపతులకు మూడేళ్ల కుమారుడు సాత్విక్, ఏడాది వయస్సున హేమశ్రీ సంతానం. పెట్రోల్ బంకులో పనిచేస్తూ జగపతిబాబు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జగపతిబాబు కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటంతో భార్య, పిల్లలు అనాధలయ్యారు.
మృతిచెందిన సంకురాత్రి జగపతిబాబు
సంకురాత్రి జగపతిబాబు(ఫైల్)
పండక్కి పుట్టింటికి వెళ్లిన భార్యను తెచ్చేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం
మృతిచెందిన గామాలపాడు యువకుడు, అనాధలైన భార్య, పిల్లలు
మృతుడు జగపతిబాబు కుటుంబంలో వరుస విషాద ఘటనలు
భార్య వద్దకు వెళ్తూ మృత్యు ఒడిలోకి..
భార్య వద్దకు వెళ్తూ మృత్యు ఒడిలోకి..


