ప్రత్యేక దృష్టితో పరిష్కరించండి
కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌తోపాటు రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు మొత్తం 96 అర్జీలు స్వీకరించిన కలెక్టర్, అధికారులు దివ్యాంగుల అర్జీలు ప్రత్యేకంగా స్వీకరించిన కలెక్టర్
పీజీఆర్‌ఎస్ అర్జీలు
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 96 అర్జీలు స్వీకరించారు. వీటిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్ ద్వారా గురజాల డివిజన్‌కు చెందిన 21, సత్తెనపల్లికి చెందిన నాలుగు, నరసరావుపేటకు చెందిన 15 మొత్తం 40 అర్జీలు స్వీకరించారు. తన వద్దకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుల వద్దకు తానే వెళ్లి వారి సమస్య విన్నారు. రెవెన్యూ క్లినిక్‌ను సందర్శించిన కలెక్టర్ అధికారులకు సూచనలు చేయటంతోపాటు పలువురిని అడిగి వారు ఏ సమస్యలతో వచ్చారో తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్‌పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నాకు నా తండ్రి ద్వారా 2.5 ఎకరాల పొలం వారసత్వంగా వచ్చింది. దాని పక్కనే ఉన్న 80 సెంట్ల భూమిని ఎనిమిది మంది ప్లాట్లు గా అమ్ముకున్నారు. దానితోపాటు నా భూ మికి రిజిస్ట్రేషన్ విలువ భారీగా పెంచారు. నా తండ్రి నాకు రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో రూ.1.70లక్షలు ఉంటే ప్రస్తుతం రూ.29.50 లక్షలుగా ఉంది. నా భూమికి విలువ తగ్గించి న్యాయం చేయండి.
–నూకవరపు పూర్ణచంద్రరావు,
ఉంగుటూరు, అమరావతి మండలం
నా తండ్రి నాకు 0.52 సెంట్ల భూమిని రాశాడు. నా భూమిని మా గ్రామానికే చెందిన ఓ వ్యక్తి పేరుపై ఆన్‌లైన్‌లో ఎక్కింది. దీనిపై నేను అధికారులకు అర్జీ పెట్టుకోవటంతో వారు వచ్చి సర్వే చేసి ఆ భూమి నాదేనని నిర్ధారించారు. ఆన్‌లైన్‌లో మాత్రం ఎక్కించటంలేదు. అందువలన ఆ భూమిని నా పేరుపై అడంగల్‌లో నమోదు చేయాలని అధికారులను కోరుతున్నా.
–పెండ్లి లూర్ధమ్మ,
రాయవరం, మాచర్ల మండలం
నాకు 24 ఏళ్ల వయస్సు. ఆరేళ్లుగా శరీరంలో నరాల బలహీనత కారణంగా ఒక్కో అవయవం పనిచేయటం లేదు. నడుము నుంచి కిందనున్న అవయవాలు పూర్తిగా పనిచేయడంలేదు. నాకు పింఛన్ మంజూరు చేసి న్యాయం చేయండి.
– కోట చరణ్‌బాబు,
కంచరగుంట, దుర్గి
ప్రత్యేక దృష్టితో పరిష్కరించండి
ప్రత్యేక దృష్టితో పరిష్కరించండి


