క్రియాశీలకంగా వ్యవహరించాలి
కేంద్ర నిధులు పొందడంలో
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వీలైనంత ఎక్కువ నిధులు పొందడంలో జిల్లా అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. తమ శాఖల పరిధిలోని పథకాల కోసం వినూత్న కార్యక్రమాలు రూపొందించి నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ నిధుల కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కేంద్రం అందించే సహకారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగించిన జిల్లాగా పల్నాడు నిలిచిందని, నిధులు ఎక్కువ సంపాదించగలిగితే జిల్లాలో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా 2025–26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించి, యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్)లను సమర్పించాలన్నారు. నరసరావుపేట, మాచర్ల ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, డీసీసీబీ బ్యాంకు చైర్‌పర్సన్ మక్కెన మల్లికార్జునరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు సూచించిన ఎంపీ లావు


