సాగు నీరు లేక ఎండిపోతున్న పైర్లు
● ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు
● ఎమ్మెల్యే సిఫార్స్ చేసినా
నీరివ్వని అధికారులు
రొంపిచర్ల: మండలంలోని అన్నవరం, తుంగపాడు గ్రామాల్లో సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న పైరుకు నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి అన్నవరం మేజర్ నుంచి నీళ్లు మళ్లించే కార్యక్రమంలో భాగంగా పది రోజులుగా సరఫరాను ఆపారు. గ్రామంలో సాగు చేస్తున్న 1,200 ఎకరాల్లోని వరి, మొక్కజొన్న పైర్లకు నీరు లేక పొలాలు బీటలు వారాయి. పది రోజులుగా అన్నవరం మేజర్‌కే నీళ్లు రావటం లేదు. కంకి దశలో ఉన్న పైరు తాలుగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సాగు చేస్తున్న వరిపైరు కంకిదశలో ఉండగా, మొక్కజొన్న పైరు 40 నుంచి 50 రోజుల పైరు అయ్యింది. వరికి చివరి ఒకటి, రెండు తడులు అవసరం ఉంది. మొక్కజొన్నకు రెండు నెలల వ్యవధిలో మూడు తడులు ఇవ్వాల్సి ఉంది. మొక్కజొన్న పైరుకు డిసెంబర్ ఆఖరిలో నీరు అందించాలి. కానీ రాకపోవటంతో నేలలో తేమశాతం లేక బీటలు వారింది. రైతులు ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. సకాలంలో నీరు అందించకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి విషయమై ఇటీవల గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు రైతులు తమ ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. వెంటనే అరవిందబాబు అక్కడి నుండే ఎన్‌ఎస్‌పీ అధికారులతో మాట్లాడారు. అయినా ప్రయోజనం మాత్రం లేదు. ఈ విషయమై రైతుల్లో కూడా చర్చ మొదలైంది. ఈ పరిస్థితుల్లో రైతులు సహనం కోల్పోయి రోడ్డెక్కి ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికై నా ఎన్‌ఎస్‌పీ అధికారులు స్పందించి సాగు నీరు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.


