పీపీపీతో పేదలకు వైద్య విద్య, వైద్యం దూరం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య
చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పేరుతో వైద్య విద్యను ప్రైవేటు పరం చేసి, పేదలకు వైద్య విద్య, వైద్యం దూరం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. చిలకలూరిపేటలో సీపీఐ శత వార్షికోత్సవ ముగింపు వేడుకలు బుధవారం నిర్వహించారు. ముందుగా పట్టణంలోని సీపీఐ కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళామందిర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు సీపీఐ చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు అమరావతి, పోలవరం రెండు కళ్లు అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండి పడ్డారు. అమరావతి కోసం భూములను సేకరించిన ప్రభుత్వం తిరిగి 16వేల ఎకరాలను రైతులను నుంచి సమీకరించనుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్ద పీట వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమంతోనే దేశంలోనే అనేక సంస్కరణలు అమలు అయ్యాయని గుర్తు చేశారు. బీజేపీ పాలన లో నినాదాలే మిగిలాయని ఎద్దేవా చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యురాలు, జిల్లా ఇన్‌చార్జి అక్కినేని వనజ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు అత్యాచారం చేసి నిర్లజ్జగా బయట తిరుగుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్, సహాయ కార్యదర్శులు కాసా రాంబాబు, హుస్సేన్, ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు బందెల నాజర్‌జీ, ఏఐవైఎఫ్ అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, సహాయ కార్యదర్శి షేక్ సుభాని, నాయకులు దాసరి వరహాలు, రమణారావు, బందెల శ్రీనివాసరావు, యుగంధర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


