రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరొకరికి గాయాలు
క్రోసూరు: మండలంలోని ఊటుకూరు శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ పి.రవిబాబు శనివారం తెలిపారు. సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన గొర్రెపాటి చందు(18), గొర్రెపాటి బుల్లిబాబు ద్విచక్ర వాహనం పై అచ్చంపేట మండలం కస్తలలో వివాహానికి హాజరై తిరిగి వెళుతున్నారు. ఊటుకూరు శివారు మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవటంతో తీవ్రగాయాలపాలై చందు అక్కడిక్కడే మృతి చెందాడు. బుల్లిబాబుకు స్వల్ప గాయాలు కావడంతో సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చేర్పించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని చందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు చెప్పారు.


