ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధన కోసం న్యాయ పోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ, పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధన కోసం న్యాయ పోరాటానికి సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం బ్రాడీపేట రెండో లైనులోని సంఘ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఆవుల తిరుమలేష్ అధ్యక్షతన జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధన కోసం చేపడుతున్న న్యాయ పోరాటానికి ప్రధానోపాధ్యాయులు సమాయత్తం కావాలని కోరారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పదో తరగతి నామినల్ రోల్స్ రూపకల్పనలో సాంకేతిక సమస్యల పరిష్కారం, అపార్ ఐడీలను క్రియేట్ చేసే విషయంలో విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘ వజ్రోత్సవ వేడుకలను రాజధాని పరిసర ప్రాంతాల్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తా శ్రీనివాసరావు


