అమరేశ్వరాలయంలో భక్తుల సందడి
అమరావతి: కార్తిక మాసం రెండో ఆదివారం సందర్భంగా అమరావతి బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేకువజామున భక్తులు తొలుత పవిత్ర కృష్ణా నదిలో కార్తిక పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలోని ఉసిరి చెట్టు వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఈఓ రేఖ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు అన్నదానం, ప్రసాదం అందజేశారు. భక్తులు, సందర్శకులు జిల్లా నలుమూలల వచ్చి అమరావతిని సందర్శించటంతో మ్యూజియం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, స్నానఘాట్‌లు, సాయి మందిరంలో సందడి నెలకొంది.
యడ్లపాడు: కొండవీడుకోట సందర్శనకు పర్యాటకులు రావద్దని పల్నాడు జిల్లా అటవీ అధికారి జి.కృష్ణప్రియ తెలిపారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో కొండవీడు కోట సందర్శకులను అనుమతించని విషయం తెలిసిందే. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కొండపై నుంచి భారీ బండరాళ్లు జారి ఘాట్‌రోడ్డుపై పడ్డాయి. వాటిని తొలగించే ప్రక్రియను అటవీశాఖ అధికారులు చేస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే కొండవీడుకోట సందర్శనకు రావద్దని ఇటీవల ప్రకటించారు. ఆదివారం ఘాట్ రోడ్డులో జరుగుతున్న తొలగింపు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొండలపై నుంచి ఊట నీటితోపాటు బండరాళ్లు జారే ప్రమాదం ఉందని తెలిపారు.
నకరికల్లు: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో మొసలి సంచారం కలకలం రేపింది. నకరికల్లు–కారంపూడి రహదారికి ఆనుకొని గుండ్లపల్లి వద్ద చెరువు ఉంది. చెరువు నుంచి రహదారిపైకి శనివారం అర్ధరాత్రి దాటాక మొసలి వచ్చింది. రోడ్డుపై పాకుతూ వెళ్తున్న సమయంలో గ్రామస్తుల కంటపడింది. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు యువకులు ధైర్యం చేసి మొసలి ఇళ్లలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గుండ్లపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎం.శ్యాం కుమార్ క్రొకోడైల్ క్యాచర్స్ సహాయంతో మొసలిని అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో తరలించి కృష్ణానదిలో వదిలారు.
నూజెండ్ల : ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన వినుకొండ పట్టణ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం.. ప్రకాశం జిల్లా కురిచేడు సమీపంలోని మున్నయ్య కాలనీకి చెందిన మున్నయ్య(25), ఆనంద్(22) వ్యక్తిగత పనులపై వినుకొండ వచ్చారు. తిరుగు ప్రయాణంలో పసుపులేరు బ్రిడ్జి ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. తలకు తీవ్ర గాయాలై ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం తెలసుకున్న పట్టణ పోలీసులు మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమరేశ్వరాలయంలో భక్తుల సందడి
అమరేశ్వరాలయంలో భక్తుల సందడి
అమరేశ్వరాలయంలో భక్తుల సందడి


