చంద్రబాబు వైఫల్యంతోనే కాశీబుగ్గ మరణాలు
మృతులకు సంతాపంగా వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ మాజీ మంత్రి విడదల రజిని, నాయకులు హాజరు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం మీడియాతో మాజీ మంత్రి విడదల రజిని
నరసరావుపేట: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అమాయకులైన 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. ఈ ఘటనలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని గుర్తుచేశారు. చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనను మరుగుపర్చేందుకు ఏ పాపం ఎరుగని బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్‌ను కల్తీమద్యం కేసులో ఇరికించి, అక్రమంగా అరెస్టు చేశారన్నారు. తద్వారా డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారన్నారు. భక్తుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.
ప్రభుత్వానిదే భద్రత బాధ్యత
ఈ సందర్భంగా రజిని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగాయన్నారు. కాశీబుగ్గలో ప్రైవేటు ఆలయమని చంద్రబాబు మాట్లాడటం చాలా దారుణం అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తే భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కచ్చితంగా చంద్రబాబు వైఫల్యమే 9 మంది అమాయక ప్రజలు చనిపోవటానికి కారణం అన్నారు. గతంలో తిరుమలలో ఆరుగురు మంది, సింహాచలంలో గోడ కూలి 8 మంది, ఇక్కడ 9 మంది చనిపోయారన్నారు.
న్యాయ విచారణ చేయాలి
ఈ సంఘటనపై ప్రజలు బాధపడుతుంటే... నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, బీసీ నాయకుడు జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేయటం దుర్మార్గం, అన్యాయమని విడదల రజిని అన్నారు. నకిలీ మద్యం తయారీదారులు కూటమి నాయకులేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టుషాపులు, పర్మిట్‌రూమ్‌లలో ఈ మద్యం విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాకెట్ బట్టబయలు కావటంతో ఆ తప్పును వైఎస్సార్‌సీపీపై వేసి మాజీ మంత్రి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. తద్వారా తమ పార్టీపై బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తుఫాన్ కారణంగా రైతులు పంటలు నష్టపోయి అల్లాడుతుంటే దాని నుంచి డైవర్షన్ చేసేందుకు జోగి రమేష్‌ను అరెస్టు చేశారన్నారు. చంద్రబాబు వైఫల్యం వలనే జరుగుతున్న సంఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కనకా పుల్లారెడ్డి, గంటెనపాటి గాబ్రియేలు, యువజన, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్, గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.కోటిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి నెలటూరి సురేష్, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, మాజీ ఎంపీపీలు, మాజీ కౌన్సిలర్లు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


