బీసీలపై కూటమి ప్రభుత్వం కుట్ర
గురజాల/గురజాల రూరల్: బీసీలపై అక్రమ కేసులు బనాయించి కక్ష్య పూరిత రాజకీయాలకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీ అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో పాటు అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని తయారు చేయించి వైఎస్సార్ సీపీకి చెందిన జోగి రమేష్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పులివెందులలో రమేష్ యాదవ్‌పై దాడి చేయడం, మహిళ అని కూడా చూడకుండా చిలకలూరిపేట మాజీ మంత్రి విడదల రజినీపై దాడి చేయడం వంటి వాటికి పాల్పడినట్లు ఆరోపించారు. తుఫాన్ వచ్చి ఒక పక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి జరిగితే కూటమి ఖాతాలోకి చెడు జరిగితే వైఎస్సార్ సీపీ మీదకి నెట్టడం కూటమి నాయకులకు అలవాటుగా మారిందని పేర్కొన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి పది మంది మృత్యువాత పడితే మాకు సంబంధం లేదు అని కూటమి ప్రభుత్వం అనడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం భక్తులకు భద్రత కల్పించడంలో కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. కార్యక్రమంలో డీకే, బండ్ల వెంకయ్య, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి చల్లా కాశీబాబు, మహంకాళీ యశోద దుర్గా, నీలంరాజు పాల్గొన్నారు.
బీసీ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గాంధీ


