వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలి
గుంటూరు వెస్ట్(క్రీడలు): ప్రతి మనిషి ఆరోగ్యంతోపాటు ఉత్సాహంగా ఉండాలంటే తమకిష్టమైన వ్యాయామం సాధన చేయాలని లలితా హాస్పిటల్స్ అధినేత కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవశర్మ తెలిపారు. జీడీఎఫ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో 2వ ఓపెన్ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీలు నిర్వహించారు. రాఘవశర్మ మాట్లాడుతూ ఎంత సంపద, పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఆరోగ్యం బాగా లేకపోతే ఉపయోగముండదన్నారు. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో యువతతోపాటు చిన్నారులు కూడా విపరీతంగా మొబైల్‌కు అలవాటు పడి జీవన విధానంతోపాటు ఆరోగ్యం కూడా పాడుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. పోటీల నిర్వాహకుడు జావెద్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలు తీసుకోవడం మాని వ్యాయామం వైపు దృష్టి సారిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బాడీబిల్డర్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. జిల్లా నుంచి జాతీయ , అంతర్జాతీయ బాడీబిల్డింగ్‌లో పేరు తెచ్చిన వారికి సన్మానం కూడా చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ లాల్‌వజీర్ పాల్గొన్నారు.


