పల్నాడు గ్రానైట్ పరిశ్రమలో ‘సీనరేజ్’ రగడ
ఏఎంఆర్ తీరుపై యజమానులు, కార్మికుల అగ్గి!
పాత ఒప్పందం ఉల్లంఘనతో పరిశ్రమ ఉనికే ప్రమాదమంటూ ఆందోళన
చిలకలూరిపేటటౌన్: కూటమి ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకుంటే పరిశ్రమల నిర్వహణ కష్టతరమైందని..దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని పల్నాడు జిల్లా గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం తమ గోడును వెల్లడించింది. శనివారం చిలకలూరిపేట మండలం యూటీ జంక్షన్‌లోని ఏఎంఆర్ చెక్‌పోస్టు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా గ్రానైట్, క్రషర్ యాజమాన్యం కార్మికులతో కలిసి తమ ఆందోళన చేపట్టారు. సంఘం ప్రతినిధి ఒంటిపులి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో భాగంగా యూటీ జంక్షన్, యడవల్లిల్లి, మద్దిరాల, గోపాళవారిపాలెం, మురికిపూడి కూడళ్ల వద్ద ఏఎంఆర్ సంస్థకు చెందిన చెక్‌పోస్టులను కార్మికులతో కలిసి మూసివేసించారు. ఏఎంఆర్ సంస్థతో చర్చలు సఫలీకృతం అయ్యేవరకు చెక్‌పోస్టులను తెరవరాదంటూ కాంట్రాక్ట్ కార్మికులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ క్రమంలో ఏఎంఆర్ సిబ్బంది, కార్మికుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఒంటిపులి ఆంజనేయులు మాట్లాడుతూ రెండేళ్లుగా మైనింగ్ సీనరేజ్ వసూలు బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఎంఆర్ ప్రైవేట్ సంస్థ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు, క్రషర్ యజమానులు, కార్మికులు ఏకమై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. క్వారీల నుంచి ముడిరాయి తరలింపు అనుమతి కోసం ఏఎంఆర్ సంస్థ ప్రారంభ దశ నుంచే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, విధివిధానాలు పాటించకుండా అనధికార వసూళ్లు చేస్తోందని గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం ఆరోపించింది. ఏఎంఆర్ సిబ్బంది తమ కార్మికులపై భౌతికదాడులు చేశారన్నారు. కాబట్టే తాము ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. గతంలోనే ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు, గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం మధ్య చర్చలు జరిగి చేసుకున్న ఒప్పందాలను ధిక్కరించి అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. పరిశ్రమలకు అన్ని విధాలుగా ఆదుకుని అభివృద్ధి చేస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గ్రానైట్, క్రషర్ పరిశ్రమలపై దృష్టి సారించి ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమలకు ముప్పు వాటిల్తుతోందని, ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.


