స్వచ్ఛత, సమాజం మధ్య నర్సింగ్ విద్యార్థులే వారధి
సాక్షి,అమరావతి: స్వచ్ఛత లక్ష్యాలను సాధించేందుకు ఆరోగ్య వృత్తి నిపుణులు మార్పునకు వారధులుగా వ్యవహరించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర సూచించారు. నర్సింగ్ విద్యార్థులు స్వచ్ఛత, సమాజం మధ్య వారధిగా ఉండాలని పిలుపునిచ్చారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) దేశంగా భారత్ అవతరించడంలో గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది చేసిన కృషి అభినందనీయమన్నారు. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో స్వచ్ఛతే సేవ– 2025 కార్యక్రమాన్ని శుక్రవారం గుంటూరు లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నిర్వహించారు. రమేష్ చంద్ర మాట్లాడుతూ పారిశుద్ధ్య మౌలిక వసతుల అభివృద్ధి, అవగాహన పెంపుతోపాటు, వ్యర్థా ల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వం, ఆరోగ్య అంశాలను మెరుగుపరిచి స్వచ్ఛత, సమాజ గౌరవాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వేమూరి వసుంధర తరగతి గదులు, హాస్టళ్లలో, కళాశాల ఆవరణ పరిసరాలలో పరిశుభ్రత, ఆరోగ్యకర వాతావరణం కోసం చేపట్టిన చర్యలను వివరించా రు. గుంటూరులో రెండు రోజులపాటు సాగిన స్వచ్ఛతా ప్రచారంలో భాగంగా, సీబీసీ గురువారం శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2 నుంచి ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా–2025 కార్యక్రమాలలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థల్లో కార్యక్రమాలను నిర్వహించి అవగాహన కల్పించినట్టు పేర్కొంది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏడీ రమేష్ చంద్ర


