లంచం ఇస్తేనే ఇంక్యుబేటర్‌లో పెట్టేది
పసికందులను ఐసీయూలో
పెట్టేందుకు లంచం డిమాండ్
ఏరియా వైద్యశాల్లో చోటుచేసుకున్న సంఘటన
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాలలో పసికందులను ఇంక్యుబేటర్‌లో పెట్టటానికి సిబ్బంది లంచం అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో బరువు తక్కువ, అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఇంక్యుబేటర్‌లో ఉంచుతుంటారు. అక్కడ ఉంచేందుకు సిబ్బంది రోగులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తంతు కొన్ని నెలలుగా జరుగుతుంది. వారం రోజుల కిందట అనారోగ్యంతో ఉన్న పసికందును ఇంక్యుబేటర్‌లో ఉంచేందుకు తీసుకెళ్లారు. ఆ విభాగంలో విధులు నిర్వర్తించే మహిళా సిబ్బంది పేషెంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. అడిగినంత ఇస్తేనే ఐసీయూ విభాగంలో ఉంచుతామని లేకుంటే ప్రైవేటు వైద్యశాలకు తీసుకు వెళ్లాలని చెప్పింది. దీంతో వారి మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వర్తించే సెక్యూరిటీ గార్డు జోక్యం జేసుకొని ఇద్దరికి నచ్చజెప్పటంతో వ్యవహారం సర్దుమణిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వీడియో సోషల్ మీడియాలో శుక్రవారం వైరల్ అయ్యింది. దీనిపై సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్‌కుమార్‌ను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. లంచం అడిగిన సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారం కిందటే ఆమెను విధులు నుంచి తొలగించామన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
