రక్తదానం ప్రాణదానంతో సమానం
బాపట్ల టౌన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సూర్య కాళి ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బంది, యువతను అభినందించారు. అనంతరం ఎస్పీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. దానం చేసే ప్రతి రక్తపు బిందువు మరొకరికి ప్రాణం పోసే అమృత బిందువు అవుతుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో రక్త నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, శస్త్ర చికిత్సల సమయంలో ఎంతో మందికి రక్తం అవసరం ఉంటుందని చెప్పారు. సమాజ శ్రేయస్సు, ప్రజలకు రక్షణ, శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి ఎందరో పోలీసులు ఆత్మార్పణ చేశారని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి 31 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా స్మృతి పరడ్, అమరవీరుల గ్రామాలను సందర్శించడం, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించడం, పోలీస్ సిబ్బంది అమరవీరుల కుటుంబాలకు మెడికల్ క్యాంపులు, ఓపెన్ హౌస్ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డీహెచ్‌ఎంఓ వి.సోమ్లా నాయక్, బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, ఏఆర్ డీఎస్పీ పి.విజయ సారథి, ఎస్‌బీ సీఐ జి.నారాయణ, బాపట్ల పట్టణ సీఐ ఆర్. రాంబాబు, వెల్ఫేర్ ఆర్‌ఐ శ్రీకాంత్, చీరాల ఏరియా హాస్పిటల్ డాక్టర్లు భరత్, రాజేష్, సిబ్బంది, పట్టణ పోలీసులు పాల్గొన్నారు.
పటేల్ జీవితం యువతకు ఆదర్శం
బాపట్ల టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని యువతరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో అయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, పోలీస్ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని తెలిపారు. ఆయన పుట్టిన రోజును రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా జరుపుకుంటారని వివరించారు. ఆయన దేశానికీ చేసిన సేవలకు గాను 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్‌నాయక్, ఏఆర్ డీఎస్పీ పి. విజయసారథి, ఎస్‌బీ సీఐ జి. నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


