పంట పొలాల్లోని నీటిని బయటకు పంపాలి
గుంటూరు వెస్ట్: మొంథా తుపాను కారణంగా పంట పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపాలని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం తగిన సూచనలు, సలహాలు అందించాలని కోరారు. జలవనరుల శాఖ వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేసి పక్కాగా సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జల వనరుల శాఖ ఎస్‌ఈ వెంకట రత్నం మాట్లాడుతూ పెదనందిపాడు వద్ద నల్లమడ వాగుకు పరుచూరు, ఆలేరు వాగుల నుంచి నీరు చేరి 42,335 క్యూసెక్కుల నీరు ప్రవహించిందని చెప్పారు. అందుకే ఆయా ప్రాంతాల్లోని పంట పొలాల్లో బాగా నీరు చేరిందన్నారు. కొమ్మూరు కాలువకు కూడా గండి పడిందన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా కింద 3,746 హెక్టార్లలో పంట నీట మునిగిందన్నారు. ఇందులో కాకుమాను మండలంలో 1,326, పెదకాకాని మండలంలో 460, పెదనందిపాడులో 363, మంగళగిరిలో 265 , తాడేపల్లిలో 92, ప్రత్తిపాడులో 70, చేబ్రోలులో 7 హెక్టార్లు ఉన్నాయన్నారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజా వలి, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా


