పోలీసు అమరవీరుల సేవలు ఎనలేనివి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దేశం కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం అందరి కర్తవ్యమని జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి నగరంపాలెం ఎస్‌బీఐ బ్యాంక్ ఎదురున్న పోలీస్ అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ మాట్లాడుతూ ఈ వారోత్సవాలు పోలీస్ శాఖ అంకితభావం, నిబద్ధత, త్యాగాలకు నిదర్శనమని అన్నారు. అమరవీరులు చూపిన ధైర్యం, త్యాగం, సేవలు అందరికీ ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఇవి భవిష్యత్ తరాలకు ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), అబ్దుల్‌అజీజ్ (గుంటూరు తూర్పు), అరవింద్ (గుంటూరు పశ్చిమ), సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్‌బీ), వీరయ్యచౌదరి (కొత్తపేట పీఎస్) సత్యనారాయణ (నగరంపాలెం పీఎస్), అశోక్ (ట్రాఫిక్ తూర్పు), సింగయ్య (ట్రాఫిక్ పశ్చిమ), ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.


