నష్టపోయిన రైతులను ఆదుకోండి
కలెక్టర్‌కు మాజీ మంత్రి విడదల రజిని వినతి తుపాను బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి
నరసరావుపేట: మోంథా తుపాను బీభత్సంతో పల్నాడు జిల్లాలో ప్రధానంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో రైతులు సర్వం కోల్పోయారని ఆ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా దృష్టికి తీసుకెళ్లారు. గురువారం కలెక్టరేట్‌లో కొందరు రైతులు ఆమెను కలసి తుపాను వలన దెబ్బతిన్న వరి, పత్తి, ఉల్లి, మొక్కజొన్న, మిరప పంటలను చూపించారు. అనంతరం ఆ వివరాలతో కూడిన సమగ్ర వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. జిల్లాలోనే చిలకలూరిపేట నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదైనందున ‘వరద ప్రభావిత ప్రాంతం’గా గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
కోలుకోలేని స్థాయిలో తీవ్ర నష్టం...
అనంతరం విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ.. తుపాను కారణంగా చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు. పంట నష్టంతోపాటుతోపాటు జాలాది తదితర ప్రాంతాల్లో ఇళ్లు కూలాయని చెప్పారు. నాదెండ్ల మండలంలో పశువులు మృతి చెందాయన్నారు. విద్యుత్ లైన్లు, రహదారులు, తాగునీటి వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. సన్నకారు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. చేతికందిన పంట పొలాల్లో ఇప్పటికీ నీళ్లు ఇంకా నిలిచే ఉన్నాయని పేర్కొన్నారు. కొంతమంది ఇళ్లు కూలిపోయి రోడ్డున పడ్డ విషయం వివరించి, బాధితుల కష్టాలను కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లామన్నారు. చిలకలూరిపేట మండలంలో పత్తి 2000, వరి 100, మొక్కజొన్న 150, యడ్లపాడు మండలంలో పత్తి 4000, వరి 150, మిర్చి 1500, ఉల్లి 100, నాదెండ్ల మండలంలో పత్తి 5000, మొక్కజొన్న 100, మిర్చి 1000 ఎకరాలలో నష్టపోయినట్లు వెల్లడించారు.
నీట మునిగిన కాలనీలు
నియోజకవర్గంలోని పలు కాలనీలు నీట మునిగాయని, పట్టణంలోని సంజీవనగర్, తండ్రి సన్నిధి, సుగాలికాలనీ, వీరముష్ఠి కాలనీతోపాటు గణపవరం గ్రామంలోని శాంతినగర్, పసుమర్రులోని ఎస్టీ కాలనీ, యడ్లపాడులోని దింతెనపాడు, బోయపాలెంలోని సుగాలికాలనీ, యడ్లపాడులోని సవళ్ల ప్రాంతాల్లో గృహాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారని రజిని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. తుపాను ప్రభావిత గ్రామాలలోని ప్రజలకు అండగా నిలబడాలని కోరారు. పంట నష్టం అంచనా కోసం సచివాలయ ఉద్యోగుల సహకారాన్ని తీసుకోవాలని, రైతులకు తగిన న్యాయం చేయాలని పేర్కొన్నారు. వరద బాధితులకు అదనంగా రేషను సరకులు ఇచ్చి ఆదుకోవాలన్నారు. దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, తాగునీటి వ్యవస్థ, రహదారులకు మరమ్మతులు చేయాలన్నారు. కలెక్టర్ తగిన తక్షణ చర్యలు చేపడతారని విశ్వసిస్తున్నామని రజిని పేర్కొన్నారు. చిలకలూరిపేట ఎంపీపీ దేవినేని శంకరరావు, మున్సిపల్ ఉపాధ్యక్షుడు వలేటీ వెంకటరావు, యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దూరి కోటిరెడ్డి, చిలకలూరిపేట నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు ప్రభుదాస్‌నాయుడు, రైతులు పాల్గొన్నారు.
నష్టంపై నివేదికలు సిద్ధం చేయండి
నరసరావుపేట: మోంథా తుఫాన్ నష్టపరిహారం నివేదికలు త్వరితగతిన సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి గురువారం జిల్లాలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని అన్నారు. జిల్లా నిధుల నుంచి కూడా మోంథా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి చర్యలు చేపడతామని వివరించారు. తుఫాన్ వల్ల మత్స్యకారులకు చెందిన పడవలు, వలలకు నష్టం పారదర్శకంగా ఎన్యూమరేషన్ చేయాలన్నారు. జిల్లాలో భూముల మార్కెట్ విలువల సవరణ ప్రతిపాదనలు వాస్తవ ధరల ఆధారంగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం మార్కెట్ విలువల సవరణపై సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు భూసేకరణ కోసం రైతులకు చెల్లించే పరిహారం మార్కెట్ విలువపైనే ఆధారపడుతుందన్నారు. జేసీ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్‌ఓ ఏకా మురళి, పల్నాడు, గుంటూరు జిల్లాల రిజిస్ట్రార్లు రాంకుమార్, ప్రసాద్ పాల్గొన్నారు.


