తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
నరసరావుపేట: తుపాను సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యాన్ని విడనాడి, బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని తుపాను ప్రభావిత ప్రాంతాలైన చంద్రబాబునాయుడు కాలనీ, బరంపేటలో బుధవారం ఆయన పర్యటించారు. ప్రజలకు పులిహోర పొట్లాలు, మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా మోంథా తుపానుపై ముఖ్యమంత్రి పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా స్థానిక ప్రభుత్వ యంత్రాంగం బేఖాతరు చేసిందని తెలిపారు. సత్తనపల్లి రోడ్డులోని చంద్రబాబు నాయుడు కాలనీ వద్ద వాగు పొంగి 10 లైన్లు, బరంపేటలో నాలుగు లైన్లు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడల స్టేడియం నీట మునిగినా సహాయక చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబించారని విమర్శించారు. చెట్లు విరిగి కరెంటు స్తంభాలు కూలిపోయినా సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదని తెలిపారు. నీట మునిగిన చంద్రబాబు నాయుడు కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఆహారం వండుకునే పరిస్థితి లేదన్నారు. మున్సిపల్ అధికారులు నామమాత్రంగా కూడా స్పందించలేదని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట అయినప్పటికీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార పొట్లాలు, మంచినీరు సరఫరా చేయలేదని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు లేచిన దగ్గర నుంచి అటు ఇటు తిరుగుతున్నాడే తప్పా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని గోపిరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వలంటీర్లను తొలగించి, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్లే సకాలంలో సహాయక చర్యలను చేపట్టలేకపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో దెబ్బతిన్న ఇళ్లను సర్వే చేయించి, బాధితులకు రూ.6వేలు ఆర్థిక సహాయం అందించినట్లు గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ తరఫున తుపాను ప్రభావిత ప్రాంతమైన చంద్రబాబునాయుడు కాలనీ, బరంపేటలో పులిహార పొట్లాలు, మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలు తుపాను ప్రభావానికి గురయ్యాయని, తక్షణమే పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కనకా పుల్లారెడ్డి, పాలపర్తి వెంకటేశ్వరరావు, గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా మున్సిపల్ విభాగ అధ్యక్షులు షేక్ రెహమాన్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షులు నిడమానూరి సురేంద్ర, అచ్చి శివకోటి, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కిశోర్, నాయకులు షేక్ ఖాదర్‌బాషా, చల్లా రామిరెడ్డి, పుల్లంశెట్టి శ్రీనివాసరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన


