చిలకలూరిపేట నియోజకవర్గంపై తుపాను ప్రభావం అత్యధికం
యడ్లపాడు: మోంథా తుపాను జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంపై అత్యధిక ప్రభావం చూపిందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మండలంలోని తిమ్మాపురం బైపాస్ వంతెన అండర్ పాస్ ప్రాంతాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైవే రహదారిపై రాకపోకలకు అడ్డంగా నిలిచిన నీటిని, నక్కవాగు వైపు నీట మునిగిన పొలాలు, హైవే డ్రైనేజీ ప్రాంతాలను ఆమె పరిశీలించారు. హైవే సిబ్బంది, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజల నుంచి సమస్యకు గల కారణాలు తెలుసుకున్నారు. కేవలం హైవే అధికారుల నిర్లక్ష్యం, డ్రైనేజీ వ్యవస్థను తక్కువ నిడివిలో నిర్మిచడం, వారికి అనుకూలంగా నీటి ప్రవాహ ప్రదేశాలను మళ్లించడంతోనే ఈ సమస్య ఏర్పడిందని రైతులు, ప్రజలు కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తుపాను కారణంగా చిలకలూరిపేటలో 220 మి.మీ., యడ్లపాడులో 170 మి.మీ., నాదెండ్లలో 130 మి.మీ.వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లాలోనే ఇది అత్యధికమని చెప్పారు. ఈ ప్రాంతాల్లోని కాలనీలు, పంట పొలాలు అధిక వర్షానికి ఎక్కువ శాతం ముంపునకు గురయ్యాయని తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇక బైపాస్ వంతెన కింద వచ్చిన నీటిని మళ్లీంచే క్రమంలో తమ పంట పొలాల్లోకి వస్తున్నాయని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తుపాను తగ్గినప్పటికీ పంటల పరిస్థితిపై అధికారులు దృష్టి సారించాలని, వాటి నష్టం తదితర వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు.
డ్రైనేజీల్లోంచి నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి
హైవే కాంట్రాక్టర్ మురళీకృష్ణను కలెక్టర్ అక్కడకు పిలిపించారు. ఎట్టిపరిస్థితుల్లో బైపాస్ వంతెన కింద నిలిచి భారీ నీటిని పంట పొలాల్లోకి పోకుండా, కేవలం హైవే సర్వీసు మార్గం వెంబడి ఉన్న డ్రైనేజీల్లోంచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి ఇబ్బందులు రాకుండా సంబంధిత శాఖ అధికారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలం పరిధిలో మేజర్ సమస్యలను తహసీల్దార్ జెట్టి విజయశ్రీని అడిగి తెలుసుకున్నారు. మైదవోలులో ఇరిగేషన్ చెరువు కట్ట బలహీనంగా ఉందని, ఇసుక బస్తాలు పెడితే బాగుంటుందని ఇరిగేషన్‌శాఖ సూచించిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తహసీల్దార్ తెచ్చారు. దాన్ని పరిశీలించి తనకు పూర్తి వివరాలు పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి. హేమలతాదేవి, ఎస్‌ఐ టి.శివరామకృష్ణ, సర్పంచ్ పి. ప్రభావతి, వీఆర్వోలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కలెక్టర్ కృతికా శుక్లా
అధికారులకు పలు సూచనలు


