పల్నాడు రైతులను ఆదుకోవాలి
గురజాల/గురజాల రూరల్: మోంఽథా తుపానుకు నష్టపోయిన పల్నాడు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కోరారు. తుపానుతో నీట మునిగిన ప్రాంతాల్ని బుధవారం ఆయన పరిశీలించారు. నగర పంచాయతీ పరిధిలోని వెంకటరావు కాలనీ, మండల పరిధిలోని చర్లగుడిపాడులో ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పెట్టుబడులు మొత్తం నీటి పాలయ్యాయని, అప్పుల ఊబిలోకి వెళ్లకుండా ప్రభుత్వం అదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. 10 రోజుల్లో కోతకు వచ్చే వరి పొలాలు సైతం నీట మునిగిపోయాయని తెలిపారు. ఇప్పటికై నా ఆ వరుణ దేవుడు కనికరించి వర్షం కురవకుండా చూడాలని ప్రార్థించారు. గతేడాది పంటలు పండినా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ ఏడాది పంటలు బాగున్నాయి అనుకున్న తరుణంలో తుపాను వచ్చి తీవ్ర నష్టం చేకూర్చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి,పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), జిల్లా ఉపాధ్యక్షుడు వి. అమరారెడ్డి, బీసీ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీ, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి, పట్టణ కన్వీనర్ కె. అన్నారావు, వేముల చలమయ్య, కొమ్మినేని రవిశంకర్, కలకండ ఆంద్రెయ్య, మన్నెం ప్రసాదరావు, శౌర్రెడ్డి, పోలా సతీష్, కోటిరెడ్డి, బాలిరెడ్డి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి


