భారీ వర్షానికి కుప్ప కూలిన ఇల్లు
విజయపురి సౌత్: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో ఓ ఇల్లు కుప్ప కూలింది. స్థానిక సీ టైపులోని గండిపోయిన గౌరమ్మ ఇల్లు వర్షానికి పడిపోయింది. మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటిని పరిశీలించారు. గౌరమ్మ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించి, పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వీఆర్వో రవి కుమార్ పాల్గొన్నారు.
జిల్లాలో 2789.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
నరసరావుపేట: తుపాను ప్రభావంతో జిల్లాలో బుధవారం ఉదయం 8.30 వరకు 2508.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందనిజిల్లా రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. సగటున మండలానికి 89.6 మి.మీ. కురిసింది. అక్కడి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 280.6 మి.మీ. పడింది. సగటున మండలానికి 10 మి.మీ. పడింది. మొత్తం 2,789.2 మి.మీ. వర్షం కురిసింది. మండలాల వారీగా పరిశీలిస్తే...చిలకలూరిపేట 209.4, నాదెండ్ల 162.4, యడ్లపాడు 154.8, శావల్యాపురం 118.8, బొల్లాపల్లి 112.6, నరసరావుపేట 105.0, కారెంపూడి 102.2, పిడుగురాళ్ల 100.6, నూజెండ్ల 98.8, పెదకూరపాడు 98.4, వినుకొండ 96.8, ఈపూరు 96.4, వెల్దుర్తి 87.3, దుర్గి 78.2, బెల్లంకొండ 77.2, గురజాల 72.2, అమరావతి 70.4, మాచవరం 69.8, క్రోసూరు 69.0, మాచర్ల 68.8, రాజుపాలెం 67.4, ముప్పాళ్ల 66.4, రొంపిచర్ల 62.4, సత్తెనపల్లి 61.8, దాచేపల్లి 58.4, రెంటచింతల 50.2, అచ్చంపేట 48.8, నకరికల్లు 43.6 మి.మీ వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి 10గంటల వరకు 138.0, 12గంటల వరకు 114,0, రెండు గంటల వరకు 6.8, నాలుగు గంటల వరకు 1.0, ఆరుగంటల వరకు 20.8 మి. మీ. వర్షం కురిసింది.
భట్టిప్రోలు: మోంథా తుపానను ప్రభావంతో కురిసిన వర్షాలకు చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరడంతో పనులు కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మురుగుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. భట్టిప్రోలు, ఐలవరం, అద్దేపల్లి గ్రామాల్లో బుధవారం పర్యటించి చేనేత మగ్గాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చేనేత కార్మికులు పనులు కోల్పోయారని, మరో రెండు, మూడు రోజులు అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుందని, దీంతో కార్మికులు తిరిగి పనిలోకి వెళ్లడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని అన్నారు. నేతన్నలకు ఆర్థిక సహాయం, బియ్యం ఇచ్చేలా జీవో ఉండేదన్నారు. గత ఏడాది మంగళగిరిలో అధిక వర్షాలకు పనులు కోల్పోయిన కుటుంబానికి రూ.25 వేలు ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం ఇచ్చారని బాపట్ల జిల్లాను తుపాను ఎఫెక్ట్‌గా ప్రభుత్వం గుర్తించి కార్మికులకు మంగళగిరి తరహాలో సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు డి. సత్యనారాయణ, సీఐటీయూ నాయకులు బి.నాగమల్లేశ్వరరావు, పి.మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


