దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
రొంపిచర్ల: మండలంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మూడు స్మార్ట్ ఫోన్‌లు, బంగారు మంగళ సూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ ఎం. హనుమంతరావు వివరించారు. రొంపిచర్ల మండలంలో వరుసగా జరుగుతున్న దోపిడీల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇందులో నలుగురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో నరసరావుపేట చీకటి కాలనీకి చెందిన దేవరకొండ భవానీ ప్రసాద్, వరవకట్టకు చెందిన షేక్ సుభాని, క్రోసూరుకు చెందిన షేక్ రంజాన్, నరసరావుపేట ఎస్‌ఆర్‌కేటీ కాలనీకి చెందిన గుంజి శ్రీనులు ఉన్నారని వెల్లడించారు. ఈ నెల 23న నరసరావుపేట నుంచి శావల్యాపురం వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి బంగారపు ఉంగరం, ఫోన్‌ను ఈ ముఠా సభ్యులు దొంగిలించారు. అదే రోజు రొంపిచర్ల నుంచి వడ్లమూడివారిపాలెం రోడ్డులో మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని బెదిరించి అతని వద్ద నుంచి రూ.1000 నగదు, సెల్‌ఫోన్‌ను దోపిడీ చేశారు. 27న వినుకొండలో మోటార్ సైకిల్‌ను చోరీ చేశారు. అదే రోజు రొంపిచర్ల విప్పర్ల రోడ్డులో వ్యక్తిపై దాడి చేసి రూ.1000 నగదును దొంగిలించారు. కర్లకుంట రోడ్డులో భార్యాభర్తలపై దాడి చేసి నగదు చోరీకి పాల్పడ్డారు. ఆయా కేసుల్లో నిందితుల వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, మంగళసూత్రం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసుల్లో నిందితుడిగా ఉన్న దేవరకొండ భవానీ ప్రసాద్‌పై 33 కేసులు, షేక్ సుభానిపై మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఆయా కేసుల్లో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వివరించారు. సమావేశంలో రూరల్ సీఐ పి. రామకృష్ణ, నరసరావుపేట రూరల్ ఎస్‌ఐ అశోక్, రొంపిచర్ల ఎస్‌ఐ మణికృష్ణ పాల్గొన్నారు.


