సేంద్రియ సాగుతో ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ
నార్నెపాడు(ముప్పాళ్ల): ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి చెప్పారు. మండలంలోని నార్నెపాడులో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసిన వరి, పత్తి, మిరప పంటలను బుధవారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న వరి పంటను, పక్కనే రసాయన వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. సాగులో ఉండే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమలకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించడం ద్వారా పంటలను రక్షించుకోవచ్చని, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. తుపాను నేపథ్యంలో పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని రైతులకు చెప్పారు. కుళ్లిన పువ్వులు, కాయలను వెంటనే తొలగించాలని తెలిపారు. మిరపలో అంతర పంటల సాగు ద్వారా చీడపీడల ఉద్ధృతి తగ్గించుకోవచ్చని చెప్పారు. వేప గింజల కషాయం లేదా అగ్నియాస్రం పిచికారీ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎస్.శ్రీధర్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారి ఎన్.శేషుబాబు, పిలిఫ్, పావని, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నందకుమార్, మధుబాబు, రైతులు ప్రసాదు, పుష్పలీల, వేమూరి రజిని, కొర్రపాటి సౌజన్య పాల్గొన్నారు.
జిల్లా మేనేజర్ అమలకుమారి


