జల దిగ్బంధంలో పెదగంజాం
చినగంజాం: తీర ప్రాంత గ్రామమైన పెదగంజాం వరద నీటిలో మునిగిపోయింది. మూడువైపులా నీరు చేరడంతో మిగతా గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దశాబ్దాలుగా తుపానులు వంటి విపత్తులు సంభవించిన సందర్భాల్లో పెదగంజాం నీటి మునుగుతూనే ఉంది. ఉప్పుగుండూరు వైపు నాగన్న వాగు అవరోధం కాగా.. రొంపేరుపై వంతెన నిర్మించినప్పటికీ ఎల్లివాగు కారణంగా సమస్య ఎదురవుతోంది. రొంపేరుపై పెదగంజాం గ్రామం వరకు రోడ్డు వేసి ఎల్లివాగు వద్ద శాశ్వతంగా వంతెన నిర్మాణం చేయాలని మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ మున్నం నాగేశ్వరరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.
జాబ్‌మేళా తేదీ మార్పు
తాడికొండ: ఏపీ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏపీ సీఆర్డీయే సౌజన్యంతో ఈ నెల 20న నిర్వహించాలని తలపెట్టిన జాబ్‌మేళా మోంథా తుపాను కారణంగా 31వ తేదీకి మార్చినట్లు సీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు తుళ్లూరులోని సీఆర్డీఏ హబ్ కేంద్రంలో జాబ్ మేళాను నిర్వహించనున్నారు. కావున నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు చెందిన 380కి పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


