విద్యుదాఘాతంతో పెంకుటిల్లు దగ్ధం
యడ్లపాడు: అగ్నిప్రమాదంలో ఓ పెంకుటిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని ఉన్నవలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామంలోని పోలేరమ్మ గుడి వెనుక వీధిలోని పెంకుటిల్లు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పల్లపోతుల పోలిరాజు, కుమారుడు ఆ ఇంటిలో నివాసం ఉంటున్నాడు. తాపీ పనులు చేసుకునే పోలిరాజు ప్రతిరోజు గుంటూరు వెళ్లి పనులు చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తాడు. కుమారుడు అయ్యప్పమాలధారణలో ఉన్నాడు. ఈ క్రమంలో మంగళవారం పోలిరాజు గుంటూరు వెళ్లగా, కుమారుడు గుడికెళ్లాడు. తెల్లవారుజాము సుమారు 4 నుంచి 9.30 గంటల వరకు విద్యుత్ సరఫరా గ్రామంలో లేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ సరఫరా వచ్చిన కొద్ది సమయానికే ఇంటి నుంచి మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. చిలకలూరిపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఈ లోగా విద్యుత్ అధికారులకు చెప్పి విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇంటి దూలాలన్నీ కాలిపోయి పైకప్పు కూలింది. ఇల్లంతా మంటలు వ్యాపించడంతో ఫ్రిజ్, టీవీ, బీరువా, డబుల్‌కాట్, దుస్తులు, వంటసామగ్రి తదితర అన్ని వస్తువులు కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు పోలిరాజు చెబుతున్నాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆర్డీఓ దృష్టికీ తీసుకెళ్లామని తక్షణ సాయం అందించి, ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం పూర్తి పరిహారం అందిస్తామని తహసీల్దార్ జెట్టి విజయశ్రీ తెలిపారు.


