నగదు పంపిణీపై ప్రచారం
పునరావాస కేంద్రాలకు తరలిన మహిళలు
కొల్లూరు: మోంథా తుపాను నేపథ్యంలో కొల్లూరులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో నగదు, నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం హోరెత్తడంతో పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. సోమవారం కొల్లూరు బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలోని కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ సిబ్బంది వద్దకు వందల సంఖ్యలో వచ్చిన మహిళలు ఆధార్ కార్డులతో పునరావాసానికి పేర్లు నమోదు చేసుకున్నారు. తర్వాత రూ. 3 వేల నగదు, బియ్యం ఇవ్వాలని పట్టుబట్టారు. అలాంటి కార్యక్రమం ఏదీ లేదని చెప్పినా వినలేదు. వచ్చే మహిళల సంఖ్య అధికం అవుతుండటంతో తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఎస్‌ఐ జానకీ అమరవర్ధన్‌ను తహసీల్దారు అప్రమత్తం చేయడంతో ఆయన సదరు కేంద్రానికి చేరుకున్నారు. ప్రార్థనా మందిరాలలోని మైక్‌ల ద్వారా నగదు, బియ్యం పంపిణీ ఇస్తున్నారని ప్రచారం చేయడంతో తాము తరలివచ్చినట్లు మహిళలు పోలీసులకు వివరించారు. చివరికి నచ్చజెప్పి వారిని పోలీసులు బయటకు తరలించారు.


