కర్షకుల్లో కలవరం
మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మొదలైన వర్షం
కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్లు
సాక్షి, నరసరావుపేట : మోంథా తుఫాన్ ప్రభావం పల్నాడు జిల్లాపై పడింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మబ్బులు పట్టింది. రోజంతా ఎండ కాయలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా ఒక్క గురజాల తప్ప అన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వార్తల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన మొదలైంది. గత వారం కురిసిన వర్షాలకు పొలాల్లో నిలిచిన నీరు ఇప్పుడిప్పుడే తగ్గుతున్న క్రమంలో మరోసారి తుఫాన్ కారణంగా భారీ వర్షాలకు నీరు నిలిచి పంటలు నాశనమయ్యే ప్రమాదముంది. తుఫాన్ ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండనుందన్న వార్తలు రైతులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల వరి పొట్ట దశలో, మరికొన్ని చోట్ల కంకి దశలో ఉంది. ముఖ్యంగా రెంటచింతల, దుర్గి, గురజాల ప్రాంతాలలో వరి నేలకొరిగే ప్రమాదం అధికంగా ఉంది. పత్తి పంట కాయ, పిందె దశలో ఉన్న ఈ నేపథ్యంలో అన్నదాతలలో గుబులు పుట్టిస్తోంది. మరోవైపు భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదముంది. సోమవారం రాత్రి గణపవరం వద్ద కొప్పుగంజి వాగు ఉధృతంగా ప్రవహించింది.
నేడూ విద్యా సంస్థలకు సెలవు...
జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అంగన్‌న్ వాడీ మొదలు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని విద్యాసంస్థలు అన్నింటికి మంగళవారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
అధికారులతో కలెక్టర్ సమీక్ష...
భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ సిబ్బంది కూలిన చెట్లను తొలగించడానికి ట్రీ కట్టర్‌లు, డీజిల్ నిల్వలు సిద్ధం చేసుకుని, తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని తెలిపారు . మానవ, పశు ప్రాణనష్టం ఏదీ జరగకూడదని నిర్దేశించారు. రైతులు పొలాల్లో నీరు నిలవకుండా చూసుకుని, పంట నష్టం తగ్గించాలి అన్నారు. అత్యవసర మందులు సిద్ధం చేసుకోవాలని, వర్షాల తర్వాత పారిశుద్ధ్యం సవాలుగా మారుతుందని, వ్యాధులు ప్రబలకుండా చూడటానికి సిబ్బందిని సంసిద్ధం చేయాలని కోరారు. జిల్లా, డివిజన్‌న్, మండల, మున్సిపల్ స్థాయిల్లో కంట్రోల్ రూములు 24 గంటలు పని చేయాలని ఆదేశించారు. రాబోయే మూడు రోజులు ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, సెల్ ఫోన్ ఆపరేటర్లు విద్యుత్ సరఫరా వ్యవస్థ సహా అన్ని కీలక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అధికారుల సూచనలను తప్పక పాటించాలని కోరారు. నదులు, నీటి ప్రవాహాల్లోకి దిగవద్దని కోరారు. లోతట్టు ప్రాంతాలలో ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న గర్భిణులను దగ్గరలోని పీహెచ్‌సీలకు తరలించాలని, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలోని గర్భిణులు, విభిన్న ప్రతిభావంతులు, చిన్న పిల్లలు, వయోవృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ అనంతరం వరద నీరు పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం, తాగునీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో తుఫాన్ ప్రమాదం ముగిసే వరకు అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవులు మంజూరు చేయడం జరగదని, సెలవులో ఉన్నవారికి రద్దు చేయడం జరిగిందని, వారు వెంటనే విధులకు హాజరు కావాలన్నారు.
పల్నాడు జిల్లా కలెక్టరేట్ 08647–252999
సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయం 08641–233400
నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం 9949067438
గురజాల ఆర్డీఓ కార్యాలయం 9177243579


